ఆ మూడో సీటు దక్కేదెవరికో..?
తెలంగాణలో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఖాళీగా ఉన్న మూడు స్థానాలలో రెండింటిపైన కాంగ్రెస్ హైకమాండ్ ఓ అంచనాకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఓ స్థానాన్ని పద్మశాలీలకు, మరోస్థానాన్ని ముదిరాజ్ కులస్తులకు కేటాయించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. దీంతో మిగిలిన మూడో సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియలోనూ సామాజిక సమీకరణాలే కీలకంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి, ముదిరాజ్ వర్గాలకు చెరో స్థానం కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మిగిలిన సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కులాలు, ఓసీలు, మైనారిటీ వర్గాల నాయకులు మూడో స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులు సైతం ఈ మూడో స్థానంపై కన్నేశారు. పద్మశాలి వర్గం నుంచి ఎరవత్రి అనిల్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, పున్నా కైలాష్ నేత, జక్కని అనిత తదితరులతో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణి పేరు కూడా పరిశీలనలో ఉంది. అలాగే ముదిరాజ్ సంఘం తరఫున నీలం మధు, ఎం. సునీత రావు వంటి నాయకులు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.
మొదటి రెండు స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చినప్పటికీ, మూడో ఖాళీ స్థానం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అన్ని వర్గాల ఆశావహులు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓసీ వర్గాల నుంచి ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, గుండెపల్లి దయా సాగర్, పవన్ మల్లాది, టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు, టీశాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
షెడ్యూల్డ్ కులాల వర్గాల నుంచి సంపత్ కుమార్, ఇందిర, దొమ్మట సాంబయ్య, అరేపల్లి మోహన్, మానవత రాయ్, వెంకటేష్ వంటి సీనియర్ నేతలు రేసులో నిలిచారు. షెడ్యూల్డ్ తెగల నుంచి బెల్లయ్య నాయక్ తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. బీసీ వర్గాల నుంచి సట్టు మల్లేశం, చనగాని దయాకర్, చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్, నేరెళ్ల శారద తదితరులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక మైనారిటీల నుంచి ముస్లిం, క్రైస్తవ వర్గాల నాయకులు కూడా తమకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ పార్టీ పెద్దలను కలుస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీ పరంగా అన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కాంగ్రెస్ నాయకత్వానికి ఈ ఎంపిక కత్తి మీద సాములా మారింది. రాష్ట్ర స్థాయి పర్యటనలు, అంతర్గత చర్చల అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ నాయలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయనున్నారు.








