కౌశిక్ రెడ్డి ఎపిసోడ్.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం!
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అసెంబ్లీ సమావేశాల్లో తోటి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల ఉదంతం ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందుంది. పాడి కౌశిక్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు సమావేశమైన ఎథిక్స్ కమిటీ శుక్రవారం మరోసారి చర్చించింది.
కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ అభ్యర్థనను ఎథిక్స్ కమిటీ నిరాకరించింది. శాసనసభ అంతర్గత విచారణల్లో న్యాయవాదులను అనుమతించే నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. అయితే న్యాయ నిపుణుల సహాయం కోరే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. విచారణను ఆలస్యం చేసేందుకే బీఆర్ఎస్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంది. కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.
తదుపరి సమావేశంలో అసెంబ్లీలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి 45 నిమిషాల వీడియోను ప్రదర్శించాలని కమిటీ నిర్ణయించింది. అయితే, గత సమావేశంలో కేవలం రెండు నిమిషాల వీడియో క్లిప్‌ను మాత్రమే చూపించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. కేవలం కొన్ని నిమిషాల క్లిప్‌ను చూపించి తమపై నిందలు మోపాలని చూస్తున్నారని, పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర వీడియోను పరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నవంబర్ 5న జరగనున్న తదుపరి సమావేశం ఈ వివాదంలో అత్యంత కీలకంగా మారనుంది. ఆ రోజు పూర్తి వీడియోను ప్రదర్శించనుండటంతో అసలు ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విచారణ కేవలం ఒక శాసనసభ్యుడి అనర్హత లేదా క్రమశిక్షణా చర్యలకే పరిమితం కాకపోవచ్చు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తోంది. నైతిక విలువలు, శాసనసభ మర్యాదల అంశంపై జరుగుతున్న ఈ పోరులో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.








