విమానంలోనే బెడ్రూమ్, షవర్, లివింగ్ రూమ్.. ఆకాశంలో ఎగిరే లగ్జరీ ఇల్లు!
విమాన ప్రయాణమంటే సీటులో కూర్చుని, భోజనం చేసి, కాసేపు నిద్రపోవడమే అనుకుంటాం. కానీ విమానంలోనే బెడ్రూమ్, సోఫాతో కూడిన లివింగ్ రూమ్, షవర్ ఉన్న బాత్రూమ్ కూడా ఉంటే? అచ్చంగా ఇలాంటి విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తోంది ఎతిహాద్ ఎయిర్వేస్. అబుదాబి నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు వెళ్లే విమానాల్లో తన ప్రత్యేకమైన ‘ది రెసిడెన్స్’ (The Residence) సూట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
విమానంలోనే మూడు గదుల ప్రైవేట్ సూట్!
ఎతిహాద్ ఏ380 విమానంలోని ది రెసిడెన్స్ సుమారు 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఈ సూట్లో మూడు ప్రత్యేక ప్రదేశాలు ఉంటాయి. ఇద్దరు కూర్చునే సోఫాతో లివింగ్ రూమ్, డబుల్ బెడ్‌తో బెడ్రూమ్, పూర్తిస్థాయి షవర్ ఉన్న ప్రైవేట్ బాత్రూమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.
ఉచిత వై-ఫై, బెడ్డింగ్, లాంజ్‌వేర్, అభిరుచులకు తగ్గట్టుగా సిద్ధం చేసే భోజనంతో పాటు ప్రత్యేక క్యాబిన్ సిబ్బంది సేవలు అందిస్తారు. అబుదాబిలో విమానం ఎక్కే ముందు ఛాఫర్ సేవలు, ప్రత్యేక ప్రైవేట్ లాంజ్ సదుపాయం కూడా ఉంటుంది. ఎతిహాద్ ప్రకారం, ఆకాశంలో మూడు గదులతో కూడిన ఇలాంటి సూట్‌ను అందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ వీళ్లదే.
ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీ వరకు..
ఈ విమానంలో తొమ్మిది ఫస్ట్ క్లాస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒక్కో దానిలో ప్రైవసీ కోసం స్లైడింగ్ డోర్లు, లెదర్ సీటు, బెడ్‌గా మార్చుకోగల ఫుట్‌రెస్ట్, 24 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఉంటాయి. విమానంలోని షవర్ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
బిజినెస్ క్లాస్‌లో 70 సీట్లు ఉండగా, వాటిని పూర్తిగా సమాంతరంగా మార్చుకుని బెడ్‌లా ఉపయోగించుకోవచ్చు. మసాజ్ ఫీచర్, సీటు సర్దుబాటు సదుపాయాలు, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ‘ది లాబీ’ అనే ఉమ్మడి లాంజ్, బార్ ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
ఎకానమీ క్లాస్‌లో 415 సీట్లు ఉన్నాయి. సర్దుబాటు చేసుకునే హెడ్‌రెస్ట్‌లు, యూఎస్బీ ఛార్జింగ్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లతో పాటు భోజనం లేదా స్నాక్స్, పానీయాలు అందిస్తారు.
అబుదాబి–బ్యాంకాక్ విమాన సమయాలు
అక్టోబర్ 26 నుంచి ఎతిహాద్ రోజువారీ ఏ380 సర్వీసులను ప్రారంభించింది. థాయ్‌లాండ్‌కు ఈ విమానాలను నడపడం ఇదే తొలిసారి.
– EY402: అబుదాబి నుంచి రాత్రి 9.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.35 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది.
– EY403: బ్యాంకాక్ నుంచి ఉదయం 8.35 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 12.20 గంటలకు అబుదాబి చేరుకుంటుంది.
సమయాలన్నీ స్థానిక సమయాల ప్రకారం ఉంటాయి.
లగ్జరీ ప్రయాణాలపై ఎతిహాద్ ఫోకస్!
పెరుగుతున్న ప్రయాణ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని శీతాకాలపు పర్యాటక సీజన్లో విమాన సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఎతిహాద్ తెలిపింది. 2026 జూన్‌లో టోక్యోకు రోజువారీ ఏ380 సర్వీసులను ప్రారంభించిన సంస్థ, ఇప్పుడు బ్యాంకాక్‌కు కూడా ఈ విమానాలను నడుపుతోంది. థాయ్‌లాండ్, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య ప్రయాణించే వారికి మెరుగైన కనెక్టివిటీ అందించడం దీని లక్ష్యం.
విమానయాన రంగంలో పోటీ ఇప్పుడు టికెట్ ధరలకే పరిమితం కావడం లేదు. ప్రయాణ సమయంలోనే విలాసవంతమైన అనుభవాన్ని అందించడం కూడా కీలకంగా మారుతోంది. అయితే ది రెసిడెన్స్‌లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుంది? సాధారణ ఫస్ట్ క్లాస్ టికెట్‌తో పోలిస్తే ధర ఎంత ఎక్కువగా ఉంటుంది? అనే వివరాలను ఎతిహాద్ ఈ ప్రకటనలో వెల్లడించలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








