సొంత ప్రభుత్వానికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అల్టిమేటం
అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అరుదుగా జరిగే పరిణామం. అయితే, కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఏకంగా సొంత పార్టీ ప్రభుత్వంతోనే ఢీ అంటే ఢీ అంటుంటారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గానికి నిధులు రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, అవసరమైతే చావుకైనా సిద్ధమని ఆయన హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కల్లెపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొద్దిమంది మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే భారీగా నిధులు కేటాయిస్తున్నారని, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్ చనిపోయిన తర్వాతే ప్రభుత్వం రూ.5 కోట్ల బిల్లులు విడుదల చేసిందని గుర్తుచేస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “తనకు కూడా చావు తర్వాతే నిధులు ఇస్తారా? చస్తేనే నిధులు ఇస్తామంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపాయి. జడ్చర్ల అభివృద్ధి కోసం రూ.40 కోట్ల బకాయిల విషయం తేలాలని, వెంటనే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందన రాకపోతే తన నియోజకవర్గ ప్రజలతో కలిసి సుమారు 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అనిరుధ్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. తాను బతకాలో, చావాలో తేల్చాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆయన హితవు పలికారు. పార్టీలకు అతీతంగా జడ్చర్ల అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చిన ఆయన, రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ గురువైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిధులు కేటాయించాలని కోరారు.
అనిరుధ్ రెడ్డి లాంటి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాకపోయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా ప్రాణాలొదిలేస్తానని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలని చూస్తున్న ప్రభుత్వానికి, సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇలాంటి నిరసనలు రావడం ఇబ్బందిని కలిగిస్తుంది. నియోజకవర్గ ప్రజల్లో తనపై వస్తున్న అసంతృప్తిని చల్లార్చడానికి, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఎమ్మెల్యే ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మంత్రుల నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయనే ఆరోపణలు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో కూడా బలపడే అవకాశం ఉంది. ఇది రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.








