కాంగ్రెస్, బీజేపీల మధ్య ‘ఈసీ’ రగడ!
ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీలు నిరసనలు, ర్యాలీలతో రక్తి కట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో రెండు జాతీయ పార్టీలు తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుండడం ఆసక్తి రేపుతోంది.
ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతోందని, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి
ఈ నిరసన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ యంత్రాంగం, ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు 20,000 మంది పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలను ఢిల్లీకి తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ చీఫ్ సహా ముఖ్య నాయకులందరూ ఈ మహా ధర్నాలో పాల్గొని కేంద్ర తీరును ఎండగట్టనున్నారు. జాతీయ స్థాయిలో ఈ అంశంపై ఉద్యమించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది.
మరోవైపు, కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేస్తున్న బీజేపీ, ఎన్నికల ప్రక్రియను సమర్థిస్తూనే అధికార పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. కాంగ్రెస్ పార్టీవి అసత్య ప్రచారాలంటూ అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. అందులో భాగంగానే నవంబర్ 2న హైదరాబాద్ లో భారీ పాదయాత్ర చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. “లోక్తంత్ర బచావో, అరాచకతా హటావో” అనే నినాదంతో సాగనున్న ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. దీంతో ఇది జాతీయస్థాయి కార్యక్రమంగా మారిపోయింది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే, రాజకీయ ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలు అర్థమవుతాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం అక్రమాలను ప్రశ్నిస్తూ జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ స్థానిక ప్రజాసమస్యలు, సంస్థాగత పటిష్టతే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఓటర్ల జాబితా సవరణ అనేది కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదని, రాబోయే రాజకీయ సమీకరణాలను శాసించే కీలక పరిణామమని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన గర్జన, నవంబర్ 2న హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించబోయే పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది.








