అమెరికా పాలిటిక్స్‌లో మన ఇండియన్ ‘జెన్-జీ’ కొత్త ట్రెండ్!
అమెరికాలో మనవాళ్లు అంటే ఇన్నాళ్లూ ఓ రకంగా , ఓ జీవన విధానంలో బ్రతికారు. ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, సొంతిల్లు, పిల్లల చదువులు, వీలైనంత వరకు సైలెంట్‌గా ఉంటూ పొలిటికల్ గొడవలకు దూరంగా ఉండటం! ఆ జనరేషన్ ఆలోచనలు దాదాపు ఇంతే. కానీ, ఇప్పుడు అక్కడ ఎదుగుతున్న ఇండియన్ అమెరికన్ ‘జెన్-జీ’ (Gen-Z) కుర్రాళ్ల దారి మాత్రం పూర్తిగా వేరు.
ఇంట్లో అమ్మానాన్నలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే, తామూ గుడ్డిగా అదే బాటలో నడవడానికి వీళ్లు అస్సలు ఒప్పుకోవడం లేదు. తమ కెరీర్, డైలీ లైఫ్, ఫ్యూచర్‌ను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో వాటి ఆధారంగానే తమ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. రేసిజమ్‌ను ధైర్యంగా ప్రశ్నిస్తూ, సొంత హక్కుల కోసం నిలబడుతున్న ఈ కుర్రాళ్ల ఆలోచనలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.
కామెంట్ చేస్తే ఊరుకోరు.. ఫ్యాక్ట్స్తోనే పక్కా కౌంటర్!
ఒకప్పుడు ఎవరైనా జాత్యహంకారంతో కామెంట్స్ చేస్తే “మనకెందుకులే, సర్దుకుపోదాం” అనుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ ఈ తరం కుర్రాళ్లు మాత్రం అస్సలు లైట్ తీసుకోవడం లేదు. రీసెంట్గా టెక్సాస్‌కు చెందిన ఒక రైట్-వింగ్ పొలిటీషియన్, యూనివర్సిటీ విద్యార్థుల సంబరాల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో బ్రౌన్ స్కిన్ ఉన్న కుర్రాళ్లు ఎక్కువమంది కనిపిస్తున్నారనే నెపంతో.. విదేశీయులు వచ్చి స్థానికుల అవకాశాలు లాక్కుంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
దానికి మన కుర్రాళ్లు వెంటనే గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం 90 శాతం సీట్లు స్థానిక నివాసితులకే కేటాయించాలనే చట్టాన్ని, స్పష్టమైన డేటాను సోషల్ మీడియాలో ముందుపెట్టి కౌంటర్ ఇచ్చారు. తమను ఎవరో తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసంగే లేదని ఇక్కడే ప్రూవ్ చేశారు.
మైండ్ ఫిక్స్ అవ్వరు.. సమస్యను బట్టే సపోర్ట్!
కుటుంబంలో పెద్దలు ఒక పార్టీ ఓటర్లు అయినంత మాత్రాన పిల్లలు కూడా దాన్నే ఫాలో అవ్వాలనే సీన్ ఇప్పుడు లేదు. 2026 ఇండియన్ అమెరికన్ అటిట్యూడ్స్ సర్వే ప్రకారం 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత ఆలోచనల్లో స్పష్టమైన షిఫ్ట్ కనిపిస్తోంది. 2024 ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్ వైపు కాస్త మొగ్గు చూపిన యూత్, ఇప్పుడు మళ్లీ డెమోక్రటిక్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే ఒకసారి ఒకరికి ఓటేసినంత మాత్రాన జీవితాంతం వారికే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, లీడర్ల పాలసీలు మరియు తమకు ఎదురయ్యే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ను బట్టే తమ మైండ్‌సెట్ మారుతుందని చాటుతున్నారు. దక్షిణాసియా నిపుణుడు మైఖేల్ కుగెల్మన్ చెప్పినట్లుగా, ఎన్ఆర్ఐ యూత్ అందరినీ ఒకే పొలిటికల్ బాక్స్‌లో పెట్టి చూడటం కుదరదు.
తరాల మధ్య గ్యాప్: పేరెంట్స్ ప్రాధాన్య వేరు, కుర్రాళ్ల ఫోకస్ వేరు
ఫస్ట్ జనరేషన్ ప్రవాస భారతీయులు కొత్త దేశంలో ల్యాండ్ అయ్యాక స్థిరపడటం, జాబ్స్ కాపాడుకోవడం, గొడవలకు దూరంగా ఉండటంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్ బయట అమెరికన్ కల్చర్, ఇంట్లో ఇండియన్ ట్రెడిషన్స్ మధ్య బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ థర్డ్ జనరేషన్‌కు వచ్చేసరికి లైన్ పూర్తిగా మారింది!
అమెరికాలోనే పుట్టి పెరిగిన ఈ జెన్-జీ కుర్రాళ్లకు తాము అక్కడ స్థానికులమని ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదు. అందుకే పేరెంట్స్ తమ లైఫ్‌ను సేఫ్‌గా బిల్డ్ చేసుకోవడంపై దృష్టి పెడితే, ఈ కుర్రాళ్లు మాత్రం అసలు అమెరికా సొసైటీ ఎలా ఉండాలి, గవర్నెన్స్ ఎలా సాగాలనే విషయాలపై డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు.
మన పొలిటికల్ ఇష్యూస్ కాదు.. అమెరికాలో మా లైఫే ముఖ్యం!
తల్లిదండ్రుల తరానికి అమెరికా నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ కావచ్చు. కానీ అక్కడ పుట్టిన యూత్‌కు మాత్రం తమ ఎడ్యుకేషన్, జాబ్స్, హెల్త్‌కేర్, రోజువారీ లివింగ్ కాస్టే మెయిన్ టాపిక్స్.
అమెరికా పాలసీలు ఇండియాకు ఉపయోగపడతాయా లేదా అనేదానికంటే, అక్కడ నివసిస్తున్న తమ డైలీ లైఫ్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతాయనేదే ఇక్కడ పాయింట్. అందుకే వీళ్లు కేవలం ఇండియన్ రూట్స్ ఉన్న ఓటర్లుగా కాకుండా, రెస్పాన్సిబుల్ అమెరికన్ సిటిజన్స్‌గా తమ వాయిస్ వినిపిస్తున్నారు.
ఆర్భాటాలు వద్దు.. గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్‌కే ఓటు!
పాలిటిక్స్ అంటే పెద్ద పెద్ద స్పీచ్‌లు, జెండాలు మాత్రమే కాదని.. మంత్ ఎండ్‌లో జేబులో ఎంత మిగులుతోంది, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎంత ఖర్చవుతోంది అనేదే అసలైన పాయింట్ అని ఈ తరం భావిస్తోంది. సర్వేల ప్రకారం చాలామంది కుర్రాళ్లు పెరిగిన ఖర్చులు, ద్రవ్యోల్బణం, హెల్త్‌కేర్ సేవల్నే తమ ప్రాధాన్యాలుగా చెప్తున్నారు.
యంగ్ ఇండియన్ అమెరికన్లు చెప్తున్న దాని ప్రకారం.. పార్టీ గుర్తులు లేదా లీడర్ ఎంత పాపులర్ అనేదానితో పనిలేకుండా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, మెడికల్ సర్వీసెస్, రియల్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్స్ చూపించే లీడర్లకే తమ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు.
చిన్న వయసులోనే విజన్.. గ్లోబల్ పాలసీలపైనా ప్రశ్నలు!
ఈ జెన్-జీ కుర్రాళ్లతో పాటు నెక్స్ట్ రాబోయే ‘జనరేషన్ ఆల్ఫా’ యువత కూడా పొలిటికల్ విజిబిలిటీలో చాలా స్పష్టతతో ఉంది. వీళ్ళంతా ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, గర్భస్రావ హక్కులు, స్థానిక తెగల హక్కులతో పాటు అమెరికా విదేశాంగ విధానాలను కూడా నిలదీస్తున్నారు. వేరే దేశాల వనరులపై ఆధిపత్యం ప్రదర్శించడం కన్నా సొంత దేశంలోని పౌరుల లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరచడంపైనే అమెరికా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అందుకే జోహ్రాన్ మమ్దానీ, అన్నా ఎస్కమానీ లాంటి యంగ్ లీడర్లు గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్‌పై మాట్లాడటం వల్లే ఈ తరానికి బాగా కనెక్ట్ అవుతున్నారు.
మొత్తానికి అమెరికాలోని భారతీయ సంతతి జెన్-జీ ఇస్తున్న క్లియర్ మెసేజ్ ఒక్కటే.. తమ రూట్స్ ఇండియాలోనే ఉండొచ్చు, అమ్మానాన్నల ఆలోచనల ఇంపాక్ట్ కొంత ఉండొచ్చు. కానీ తమ ఫ్యూచర్‌ను డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ, సమస్యలపై నిలదీసే వాయిస్ తమకు సొంతంగా ఉన్నాయి! పాలిటిక్స్‌ను ఫ్యామిలీ నుంచి కాపీ కొట్టడం కాకుండా, తమ ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుంచే పొలిటికల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం ఈ కొత్త తరం తెస్తున్న నిజమైన చేంజ్.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








