డెడ్‌లైన్ దాటితే ఇక అంతేనా? అక్టోబర్ 23 నుంచి మారిన రూల్స్ ఇవే!
అమెరికా వీసా కోసం అప్లై చేస్తున్నారా? పిల్లలకు గ్రీన్ కార్డ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా ఇప్పటికే అమెరికాలో H-1B వీసాపై ఉద్యోగం చేస్తున్నారా? అయితే ఒక చిన్న తేదీ మీ ప్లాన్లను ఇబ్బందుల్లో పడేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే, దరఖాస్తు గడువు శని, ఆదివారాల్లో లేదా సెలవు రోజుల్లో వస్తే మరో రోజు సమయం దొరుకుతుందని ఇకపై అన్ని సందర్భాల్లోనూ అనుకోలేరు. అక్టోబర్ 23, 2026 నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ USCIS కొత్త మార్గదర్శకాలు ఈ విషయంలో కీలకమైన తేడాలను స్పష్టం చేస్తున్నాయి.
సెలవు రోజు వచ్చిందని మరో రోజు దొరుకుతుందా?
సాధారణంగా ఏదైనా దరఖాస్తుకు చివరి తేదీ ఆదివారం లేదా ప్రభుత్వ సెలవు రోజున వస్తే, మరుసటి పని రోజున సమర్పించవచ్చని చాలామంది భావిస్తుంటారు. కొన్ని రకాల పేపర్ దరఖాస్తులకు ఈ అవకాశం ఇప్పటికీ ఉండొచ్చు. కానీ అదే వెసులుబాటు ప్రతి వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకూ వర్తిస్తుందని అనుకోవద్దు.
అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ USCIS సెప్టెంబర్ 23న జారీ చేసిన కొత్త పాలసీ మార్గదర్శకాలు.. దరఖాస్తు సమర్పించడానికి ఇచ్చే గడువుకు, ఇమ్మిగ్రేషన్ ప్రయోజనం పొందేందుకు అర్హత నిర్ణయించే తేదీకి మధ్య తేడాను స్పష్టం చేశాయి. అంటే, ఒక దరఖాస్తును ఎప్పుడు సమర్పించాలనే విషయంలో కొంత వెసులుబాటు ఉండొచ్చు. కానీ వీసా లేదా గ్రీన్ కార్డ్‌కు అర్హత సాధించాల్సిన గడువు విషయంలో మాత్రం అదే సదుపాయం ఉంటుందని చెప్పలేం.
ఇవి కూడా చదవండి
పిల్లలకు గ్రీన్ కార్డ్ తీసుకునేవారు మరింత జాగ్రత్త!
అమెరికాలో ఉన్న పిల్లలకు కుటుంబ ఆధారంగా గ్రీన్ కార్డ్ తీసుకోవాలని చూస్తున్న తల్లిదండ్రులు ఈ మార్పును ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే కొన్ని ఇమ్మిగ్రేషన్ కేటగిరీల్లో 21 ఏళ్ల వయసు కీలకమైన అర్హత పరిమితిగా ఉంటుంది. స్పెషల్ ఇమ్మిగ్రెంట్ జువెనైల్ (SIJ) వర్గీకరణకు సంబంధించిన కొన్ని కేసుల్లోనూ నిర్దిష్ట వయసులోపు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, ఒక పిల్లవాడికి 21 ఏళ్లు నిండే తేదీ ఆదివారం వచ్చిందనుకుందాం. ఆ కారణంగా సోమవారం వరకు సమయం దొరుకుతుందని భావించడం ప్రమాదకరం. అర్హతకు సంబంధించిన గడువు ఆటోమేటిక్‌గా పొడిగించబడదు. ఇలాంటి కేసుల్లో ఒక్క రోజు ఆలస్యం కూడా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనం పొందే అవకాశాన్ని ప్రభావితం చేయొచ్చు. అందుకే చివరి తేదీ దగ్గరపడే వరకు వేచి చూడకుండా ముందుగానే పిటిషన్ సిద్ధం చేసుకోవడం మంచిది.
H-1B ఉద్యోగులు కూడా ఈ విషయం మర్చిపోవద్దు
అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తున్నవారికి కూడా గడువులను సరిగ్గా గమనించడం ముఖ్యం. ముఖ్యంగా Form I-94లో ఉన్న అనుమతితో కూడిన బస గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవాలి. ఈ రికార్డే సాధారణంగా ఒక వ్యక్తి అమెరికాలో ఎంతకాలం ఉండేందుకు అనుమతి పొందారో సూచిస్తుంది.
ఆ గడువు వారాంతంలో లేదా ప్రభుత్వ సెలవు రోజున ముగుస్తోందని, మరుసటి పని రోజు వరకు సమయం ఉంటుందని ఊహించకూడదు. వీసా పొడిగింపు పిటిషన్‌ను ఎప్పుడు, ఎలా సమర్పించాలనేది ఆయా కేసులకు వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు, యజమానులు ముందుగానే తేదీలను పరిశీలించుకుని అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.
ఆన్లైన్లో అప్లై చేసేవారికి కూడా ఇదే రూలా?
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. పేపర్ రూపంలో పంపే దరఖాస్తులకు వర్తించే గడువు పొడిగింపు, ఆన్లైన్లో సమర్పించే దరఖాస్తులకు కూడా వర్తిస్తుందని అనుకోకూడదు. ఆన్లైన్ ఫైలింగ్ విధానంలో వారాంతాలు, సెలవు రోజుల్లోనూ దరఖాస్తు సమర్పించే అవకాశం ఉండొచ్చు. అందువల్ల ప్రతి ఫారమ్‌కు సంబంధించిన అధికారిక సూచనలను విడిగా పరిశీలించడం అవసరం.
చివరి నిమిషం వరకు వేచి చూడకండి!
అమెరికా వీసా లేదా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఉన్నవారు ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని తమ దరఖాస్తుకు వర్తించే గడువును ముందుగానే నిర్ధారించుకోవడం. USCIS అధికారిక పాలసీ మాన్యువల్‌లోని సూచనలను పరిశీలించి, అవసరమైతే ఇమ్మిగ్రేషన్ నిపుణుల సలహా తీసుకోవాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే..
గడువు తేదీ సెలవు రోజున వచ్చిందని మీకు మరో రోజు సమయం తప్పకుండా దొరుకుతుందని అనుకోవద్దు. ముఖ్యంగా పిల్లల వయసుతో ముడిపడిన గ్రీన్ కార్డ్ కేసులు, H-1B ఉద్యోగుల బస గడువుల విషయంలో ముందస్తు ప్రణాళికే ఇబ్బందులను నివారించగలదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








