నెతన్యాహు పాలనకు లిట్మస్ టెస్ట్..!
ఇజ్రాయెల్ ఎన్నికల్లో గెలిచేదెవరు.. ప్రస్తుత విపత్కర కాలంలో ప్రజలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహును బలపరుస్తున్నారా.. విపక్షానికి అధికార పగ్గాలు అందిస్తారా.. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎన్నికల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం. అయితే మరోసారి తాము అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమన్న ధీమా బెంజమిన్ నెతన్యాహులో కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇరాన్ పై అమెరికా సాయంతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆ దేశాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేయడంతో పాటు పశ్చిమాసియాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం ఇజ్రాయెల్ లక్ష్యం. దీన్ని సాధించేదిశగా ప్రస్తుత బీబీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారితే సమస్యలు తప్పవన్నది నెతన్యాహు సర్కార్ అభిప్రాయం. దీన్నే ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పలుమార్లు ప్రస్తావించారు కూడా.
ఇవి కూడా చదవండి
2023 నాటి హమాస్ దాడి, అనంతర యుద్ధాలు, విదేశాంగ విధానాలతో పాటు దేశీయంగా పలు అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. నెతన్యాహు నాయకత్వానికి పరీక్షగా నిలవనున్నాయి. ఈ దేశ పార్లమెంటును కనెసెట్ అని పిలుస్తారు. ఇందులో 120 మంది సభ్యులు ఉంటారు. వారి పదవీకాలం నాలుగేళ్లు. ఇక్కడ దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. దేశమంతటినీ ఒకే నియోజకవర్గంలా పరిగణిస్తారు. వ్యక్తులకు కాకుండా.. పార్టీలకు ప్రజలు ఓటేస్తారు. పార్లమెంటులో ప్రవేశించాలంటే ఏ పార్టీకైనా కనీసం 3.25% ఓట్లు రావాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.
నెతన్యాహు 1996 నుంచి ఇప్పటివరకు వేర్వేరు దఫాల్లో 19 ఏళ్లపాటు ప్రధానిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ మాజీ చీఫ్ గడీ ఐసెన్కోట్, మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ వంటి విపక్ష నేతలు నెతన్యాహును గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారు.








