TikTok, YouTubeలకు పోటీగా Instagram షాకింగ్ ప్లాన్.. ఇకపై 90 నిమిషాల వీడియోలు కూడా!
ఇన్నాళ్లూ Instagram ఓపెన్ చేయగానే ఫొటోలు, చిన్న చిన్న Reels, వాటికి సరిపోయే ట్రెండింగ్ పాటలు కనిపించేవి. ఒక వీడియో నచ్చితే మరోటి.. అది నచ్చితే ఇంకోటి.. ఇలా చూస్తూ చూస్తూనే అరగంట ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియదు. కానీ Instagram ఇప్పుడు ఈ చిన్న వీడియోల ప్రపంచాన్నే నమ్ముకుని కూర్చోవడం లేదు.
గంటన్నర పాటు సాగే వీడియోలు, ఎపిసోడ్ల రూపంలో వచ్చే చిన్న కథలు, మరింత మందికి చేరే లైవ్ స్ట్రీమింగ్‌తో తన రూపురేఖలనే మార్చుకోవడానికి సిద్ధమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. Instagramకు ఇప్పుడు TikTokతో పోటీ పడటమే కాదు, YouTube లాంటి వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఎదగాలన్న లక్ష్యం కూడా ఉంది!
రీల్స్ నుంచి గంటన్నర వీడియోల వరకు!
Instagramలో ఇప్పటివరకు ఎక్కువగా కనిపించేది నిలువుగా ఉండే చిన్న వీడియోలే. ఫోన్‌ను చేతిలో పట్టుకుని స్క్రోల్ చేస్తూ చూడటానికి వీలుగా ఉండే ఈ Reelsకు మంచి ఆదరణ కూడా ఉంది. అయితే ఒక విషయాన్ని గమనించారా? కొన్నిసార్లు ఒక మంచి కథ చెప్పాలన్నా, ఒక విషయాన్ని వివరంగా చూపించాలన్నా, కొన్ని నిమిషాల వీడియో సరిపోదు. అలాంటి కంటెంట్ కోసం చాలామంది ఇప్పటికీ YouTubeనే ఆశ్రయిస్తుంటారు.
ఇప్పుడు Instagram ఈ పరిస్థితిని మార్చాలనుకుంటోంది. అందులో భాగంగా ‘Features’ పేరుతో కొత్త వీడియో ఫార్మాట్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా క్రియేటర్లు గరిష్ఠంగా 90 నిమిషాల నిడివి ఉన్న హారిజాంటల్ వీడియోలను రూపొందించవచ్చు. అంటే ఇప్పటివరకు Reelsకు అలవాటుపడిన ప్రేక్షకులకు, ఇకపై మరింత సుదీర్ఘమైన వీడియోలను కూడా అదే యాప్‌లో చూసే అవకాశం కల్పించాలన్నమాట.
ఇవి కూడా చదవండి
ఇది కేవలం వీడియో నిడివిని పెంచడం మాత్రమే కాదు. Instagramలో కంటెంట్ ఎలా ఉండాలన్న దానిపైనే కంపెనీ ఆలోచన మారుతోందనడానికి ఇదొక సంకేతం. చిన్న వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, వాళ్లు ఎక్కువసేపు యాప్‌లో గడిపేలా చేసే కంటెంట్‌కూ స్థానం కల్పించాలన్నది ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఆలోచనగా కనిపిస్తోంది.
వెబ్ సిరీస్‌ల తరహాలో చిన్న కథలు.. Instagramలోనే!
ఇక మరో ఆసక్తికరమైన మార్పు ‘Series’. పేరులోనే ఉన్నట్టుగా, ఇందులో కథలను ఒక్క వీడియోతో ముగించకుండా వరుస ఎపిసోడ్ల రూపంలో అందించడానికి వీలుంటుంది. ఉదాహరణకు, ఒక ప్రేమకథను తీసుకోండి. మొదటి ఎపిసోడ్లో పరిచయం, రెండో ఎపిసోడ్లో సమస్య, మూడో ఎపిసోడ్లో అనూహ్యమైన మలుపు.. ఇలా కథను చిన్న చిన్న భాగాలుగా ముందుకు తీసుకెళ్లవచ్చు. తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రేక్షకులు మళ్లీ యాప్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటి మైక్రో డ్రామాలకు ఇప్పటికే డిజిటల్ ప్రపంచంలో ఆదరణ పెరుగుతోంది. పెద్ద తెరపై సినిమా చూడటానికి సమయం కేటాయించలేని వాళ్లు, ప్రయాణాల్లోనో ఖాళీ సమయాల్లోనో ఫోన్లో చిన్న కథలను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ ఆసక్తిని Instagram కూడా తనకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. క్రియేటర్లకు కథలు చెప్పేందుకు కొత్త మార్గం దొరకడంతో పాటు, ప్రేక్షకులను తమ దగ్గరే ఉంచుకునే అవకాశం కూడా లభిస్తుంది.
ఫాలో కాకపోయినా లైవ్ వీడియోలు కనిపిస్తాయి!
Instagram మరోసారి దృష్టి పెట్టిన అంశం Live. దాదాపు పదేళ్లుగా అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు మరింత మందికి చేరువ చేయాలని కంపెనీ భావిస్తోంది. సాధారణంగా మనం ఫాలో అయ్యే వ్యక్తులు లైవ్‌లోకి వస్తేనే వాళ్ల ప్రసారాలను చూడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇకపై లైవ్ వీడియోలను గుర్తించడం సులభం చేయడంతో పాటు, ఆ క్రియేటర్‌ను ఫాలో కాని వాళ్లకూ వాటిని పరిచయం చేసేలా మార్పులు తీసుకురావాలని Instagram చూస్తోంది.
ముఖ్యంగా Reels విభాగంలోనూ లైవ్ ప్రసారాలు కనిపించేలా చేయడం ద్వారా కొత్త ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఒక వ్యక్తి సాధారణంగా Reels చూస్తూ యాప్‌లోకి వచ్చినా, మధ్యలో ఆసక్తికరమైన లైవ్ ప్రసారం కనిపిస్తే అందులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా లైవ్ వీడియోలను మరింత సులభంగా కనుగొనేలా చేయడం వల్ల క్రియేటర్లకు కొత్త ప్రేక్షకులు దొరకవచ్చు.
Instagramకు ఇంత పట్టుదల ఎందుకు?
ఇక్కడే అసలు కథ ఉంది. TikTok చిన్న వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, YouTube మాత్రం చిన్న వీడియోల నుంచి గంటల తరబడి సాగే కంటెంట్ వరకు విస్తృతమైన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ప్రేక్షకులు ఏం చూడాలనుకున్నా ఒకే చోట దొరికేలా YouTube తన పరిధిని పెంచుకుంది. ఇప్పుడు Instagram కూడా అలాంటి స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఒకప్పుడు ఫొటోలు పంచుకునే యాప్‌గా మొదలైన Instagram, ఆ తర్వాత Stories, Reels, Live అంటూ తన పరిధిని విస్తరించుకుంది. ఇప్పుడు దీర్ఘ నిడివి వీడియోలు, ఎపిసోడిక్ కథలను కూడా ప్రోత్సహిస్తే, క్రియేటర్లు తమ కంటెంట్ కోసం వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడాల్సిన అవసరం కొంత తగ్గవచ్చు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఒకే యాప్‌లో రకరకాల వీడియోలను చూసే అవకాశం ఉంటుంది.
అయితే కొత్త ఫీచర్లు తీసుకొచ్చినంత మాత్రాన YouTubeకు పోటీ ఇవ్వడం అంత సులభం కాదు. దీర్ఘ నిడివి వీడియోలను చూసే అలవాటు, క్రియేటర్లకు అందే ఆదాయం, కంటెంట్‌ను ప్రేక్షకులకు చేరవేసే విధానం వంటి అంశాలు కూడా కీలకమే. Instagram ఈ విషయంలో ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.
మొత్తానికి….
Instagram ఇక కేవలం ఫొటోలు అప్లోడ్ చేసే యాప్గానో, ఖాళీ సమయంలో Reels చూసే చోటుగానో ఉండాలనుకోవడం లేదు. చిన్న కథల నుంచి గంటన్నర వీడియోల వరకు, లైవ్ ప్రసారాల నుంచి ఎపిసోడిక్ వినోదం వరకు అన్నింటికీ ఒకే వేదికగా ఎదగాలని చూస్తోంది. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది పక్కన పెడితే, వీడియోల ప్రపంచంలో Instagram తన ఆటను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమైందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








