ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి ఏమైంది?
కేసీఆర్ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల చుట్టూ మరోసారి రాజకీయ రగడ మొదలైంది. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ శివార్లలోని సర్వే నంబర్ 325 చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. రికార్డుల్లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. సర్వేలో 343 ఎకరాలు మాత్రమే బయటపడింది. దీంతో 45 ఎకరాలు మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడీ అంశం రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ భూమి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ఆనుకుని ఉంది. దీంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది.
కేసీఆర్ ఫాంహౌస్ లో ఆక్రమిత భూమి ఉందంటూ సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అంతేకాక, ఈ అంశంపై రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే చేశారు. మొదటి దశ సర్వేలో రైతుల కబ్జాలోని భూములు, హద్దులు గుర్తించిన తర్వాత రీసర్వే చేపట్టారు. అధికారులు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో స్థానికుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములు ఈ సర్వే నంబర్‌కు ఆనుకుని ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే ఇప్పటివరకు ఫామ్‌హౌస్‌లోకి అధికారులు వెళ్లలేదు. నోటీసులు కూడా అందించలేదు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను ఆక్రమించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన రైతులకు, దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తామని, అలాగే తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ జరిగిన అభివృద్ధి, నీటి వనరులు, సరిహద్దు మార్పులపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా ప్రతిపక్షాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నారని వారి వాదన.
మరోవైపు శివారు వెంకటాపూర్ గ్రామస్తులు తమ భూములు ఎర్రవల్లిలో కలిపేశారని ఆందోళన చెందుతున్నారు. సరిహద్దుల నిర్ధారణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. రైతులు రెవెన్యూ మంత్రిని కలిసి పిటిషన్లు ఇవ్వడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ధరణి పోర్టల్‌లోని రికార్డుల వైరుధ్యాలు, గత పాలనలో జరిగిన సర్వేలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో భూ సమస్యలు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ అనే అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ ఇమేజ్ను నిర్మించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ను భూదోపిడీదారుగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. కేసీఆర్ ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్న నేపథ్యంలో ఈ సర్వే ఆయనపై నిరంతర ఒత్తిడి సృష్టిస్తోంది.
అయితే న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నిర్ధారణలు చేయడం సరికాదు. రీసర్వే ఫలితాలు, నోటీసులకు వచ్చే సమాధానాలు, సరిహద్దు నిర్ధారణలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ 45 ఎకరాలు నిజంగా ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందా లేక రికార్డుల లోపమా? అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు ఎర్రవల్లిపై ఉత్కంఠ కొనసాగనుంది.








