తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డికి ఎందుకంత పట్టు?
తెలంగాణ రాజకీయాల్లో జల వివాదాలు ఎప్పుడూ కీలకం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగానే, తాజాగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈ బ్యారేజీ సాధన కోసం ఆయన ముంబైకి వెళ్లి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దశాబ్దాలుగా అటకెక్కిన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించడం ద్వారా, ఉత్తర తెలంగాణ రైతాంగంపై తన ముద్ర వేయాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఒరిజినల్ డిజైన్ ప్రకారం 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీరు అందేది. అయితే, మహారాష్ట్రలో ముంపు పేరుతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి రీడిజైన్ చేసింది. ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా, మేడిగడ్డ కుంగిపోవడం వంటి పరిణామాలు కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కాగ్ నివేదికలు కాళేశ్వరం వైఫల్యాలను ఎండగడుతున్న తరుణంలో… రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టిని తెరపైకి తెచ్చారు. ఇది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను ప్రజల ముందు ఎత్తిచూపడానికి కాంగ్రెస్‌కు దొరికిన తిరుగులేని రాజకీయ ఆయుధంగా మారింది.
ఇవి కూడా చదవండి
అంతర్రాష్ట్ర జలవివాదాలను కేవలం రాజకీయ విమర్శలతో పరిష్కరించలేమని నమ్మిన రేవంత్ రెడ్డి… ఇచ్చిపుచ్చుకునే ధోరణితో దౌత్యానికి తెరతీశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీలో ఆయన కేవలం ప్రతిపాదనలు మాత్రమే పెట్టలేదు.. మహారాష్ట్రలో ముంపు భయాలను తొలగించేందుకు అత్యాధునిక డిజిటల్ మ్యాపింగ్, రక్షణ గోడల నిర్మాణం, మార్కెట్ ధర కంటే మెరుగైన కాంపెన్సేషన్ ప్యాకేజీని ప్రకటించారు. ఒక స్పష్టమైన ఫిస్కల్ & ఇంజనీరింగ్ మోడల్ ను మహారాష్ట్ర ముందుంచడం ద్వారా పొరుగు రాష్ట్రం అభ్యంతరాలను శాస్త్రీయంగా తిప్పికొట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లోనూ చూపగలదనే సంకేతాన్ని రేవంత్ ఇస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ కేవలం నీటిపారుదల అంశానికి మాత్రమే పరిమితం కాదు.. రాజకీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లా రైతాంగం మద్దతను కూడగట్టేందుకు తుమ్మిడిహట్టి ఒక మైలురాయి కానుంది. భారీ విద్యుత్ ఖర్చులతో కూడిన పంపింగ్ భారాన్ని తగ్గించి, గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తే రైతుల నుంచి ఆదరణ లభిస్తుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు.
మొత్తంగా చూస్తే, తుమ్మిడిహట్టి సాధన ద్వారా గత ప్రభుత్వ పాలనా లోపాలను ఎత్తిచూపుతూనే, తమది ప్రజానీకానికి మేలు చేసే ప్రత్యామ్నాయ పాలన అనిపించుకునందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ముంబై భేటీ సత్ఫలితాలు ఇస్తే, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం.








