బంగారం లాంటి రోడ్డు కాదు.. బంగారపు రోడ్డే! ఇది నిజం
దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారంతో ప్రపంచంలోనే తొలి గోల్డ్ వాక్‌వే.. 2026 చివరి నాటికి ప్రారంభం!
రోడ్డు మీద బంగారం కనిపిస్తే ఏం చేస్తారు? ఆగి చూస్తారు.. వీలైతే ఏరుకుంటారు! కానీ అదే రోడ్డు మొత్తం బంగారంతో ఉంటే? దానిపైనే నడవమంటే? అదీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమైతే? కళ్లు చెదిరే ఈ ఊహకు దుబాయ్ ఇప్పుడు నిజరూపం ఇవ్వబోతోంది! అవును.. బంగారం లాంటి రోడ్డు కాదు.. అక్షరాలా బంగారపు రోడ్డే!
ప్రపంచంలోనే తొలిసారిగా, అత్యంత పొడవైన 24 క్యారెట్ల గోల్డ్ వాక్‌వేను నిర్మించేందుకు సిద్ధమవుతోంది దుబాయ్. 2026 చివరి నాటికి అందుబాటులోకి రానున్న ఈ వింత ఆకర్షణ అందుబాటులోకి వస్తే.. బంగారాన్ని ఒంటిపై ధరించడమే కాదు, దానిపైనే నడిచే అరుదైన అనుభూతిని కూడా పర్యాటకులు సొంతం చేసుకోవచ్చు!
ఎక్కడీ బంగారపు రోడ్డు!
దుబాయ్‌లోని ప్రముఖ బంగారం, ఆభరణాల వ్యాపార కేంద్రం దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఈ గోల్డ్ వాక్‌వేను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 25న గల్ఫ్ టుడే ప్రచురించిన కథనం ప్రకారం, రాబోయే రెండు నెలల్లో, అంటే 2026 చివరి నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ వాణిజ్య విభాగం సీనియర్ డైరెక్టర్ రషీద్ అల్ హర్మౌది వెల్లడించిన వివరాల ప్రకారం, సందర్శకులు బంగారు బాటపై నడుస్తున్న అనుభూతిని పొందేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ప్రపంచంలోనే తొలి, అత్యంత పొడవైన బంగారు నడక మార్గంగా దీనిని ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ వాక్‌వే పొడవు ఎంత? నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఇందులో అసలు ఎంత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగిస్తారు? వంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు. 24 క్యారెట్ల బంగారంతో నిర్మిస్తారన్న ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, ఆ బంగారాన్ని ఏ రూపంలో, ఎంత మందంతో ఉపయోగిస్తారన్నది తెలియాల్సి ఉంది.
బంగారమే కాదు.. వ్యాపారానికీ మెరుపు!
ఈ గోల్డ్ వాక్‌వే కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు. అంతర్జాతీయ బంగారం, ఆభరణాల మార్కెట్లో దుబాయ్ స్థానాన్ని మరింత బలోపేతం చేయాలన్న విస్తృత ప్రణాళికలో ఇదొక భాగం.
2026 ప్రారంభం నుంచి దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన హోల్‌సేల్ బంగారం వ్యాపార కార్యాలయాల సంఖ్య 20 శాతం పెరిగిందని రషీద్ అల్ హర్మౌది తెలిపారు. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లు, లగ్జరీ వాచీలు విక్రయించే కొత్త దుకాణాల సంఖ్య కూడా ఇదే కాలంలో 15 శాతం పెరిగింది.
వ్యాపార సంస్థలకు మరింత స్థలం కల్పించేందుకు కార్యాలయాలు, రిటైల్ దుకాణాల విస్తరణ కూడా జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ ప్రాంతానికి తరలివచ్చే కంపెనీల సంఖ్య 10 నుంచి 20 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు, మధ్యప్రాచ్యంలోనే అతిపెద్దదిగా నిలవాలనే లక్ష్యంతో ఒక భారీ బంగారం, ఆభరణాల ప్రదర్శనను నిర్వహించే ప్రణాళికలూ ఉన్నాయి. గోల్డ్ వాక్‌వే ఈ కార్యక్రమాలకు అదనపు ఆకర్షణగా మారనుంది.
బంగారు ఆభరణాల్లోనూ దుబాయ్ రికార్డులే!
బంగారంతో ప్రత్యేకమైన ఆకర్షణలను సృష్టించడంలోనూ దుబాయ్ ఇప్పటికే వార్తల్లో నిలిచింది. జోయలుక్కాస్ జ్యువెలరీ రూపొందించిన సంప్రదాయ భారతీయ జుంకాలు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాయి. బంగారు చెవిపోగుల జంటలో అత్యధిక బరువు, అత్యంత పెద్ద పరిమాణానికి సంబంధించిన రికార్డులు వీటి ఖాతాలో చేరాయి.
‘మయూర సహస్ర’ పేరుతో రూపొందించిన ఈ జుంకాల బరువు ఏకంగా 16.514 కిలోలు. 22 క్యారెట్ల బంగారంతో వీటిని తయారు చేశారు. వీటిని విక్రయించకుండా దుబాయ్‌లో శాశ్వతంగా ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఇప్పుడు 24 క్యారెట్ల బంగారు వాక్‌వే ప్రాజెక్టు కూడా కార్యరూపం దాలిస్తే, బంగారం వ్యాపారంతో దుబాయ్‌కు ఉన్న అనుబంధానికి మరో అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, ప్రపంచ బంగారం మార్కెట్లో నగరానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరింత చాటిచెప్పే అవకాశం ఉంది.
బంగారంలాంటి అనుభూతి కలిగించే ప్రదేశాలు ఎన్నో ఉండొచ్చు. కానీ నిజంగానే బంగారంతో నిర్మించిన దారిపై నడిచే అవకాశం మాత్రం అరుదే! ఆ అనుభూతి కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు దుబాయ్‌కు వస్తారేమో చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








