జగన్ పాదయాత్ర ఆ రోజు నుంచేనా..?
గత కొన్నాళ్ళుగా పాదయాత్ర చేస్తాను అని చెప్తూ వస్తోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) తాజాగా పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ఉత్కంఠ నడుస్తున్న వేళ, తన సొంత నియోజకవర్గమైన పులివెందుల వేదికగా ఆయన క్యాడర్లో సరికొత్త జోష్ నింపే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా రాబోయే సెప్టెంబర్ నెల నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే తుడిచిపెట్టుకుపోతుందని జగన్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
వైసీపీ కార్యకర్తలకు జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఒక వర్గం సమయం నడుస్తోందని, భవిష్యత్తులో తమ సమయం తప్పక వస్తుందని వ్యాఖ్యానించారు. అన్యాయం చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని, అన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తామని పోలీసులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. తనపై రాజకీయంగా అన్యాయం చేయాలనుకుంటే ఎంతమంది వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకు అండగా నిలిచే పులివెందుల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ తాజా ప్రకటనపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటన ద్వారా పార్టీ శ్రేణుల్లో స్థానిక ఎన్నికల వేళ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ రెండు నుంచి జగన్ పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, అధికారంలో ఉన్న కూటమి నేతలు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఓటమి నైరాశ్యంతోనే జగన్ పోలీసులపై, ప్రభుత్వంపై ఇలాంటి బెదిరింపు ధోరణి వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార పక్ష నేతలు విమర్శిస్తున్నారు.








