ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమి నేతలు, పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారని, నామినేషన్ల దాఖలుకు గడువును మరింత పెంచాలంటూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఈ తీర్పుతో ఏపీలో ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.
ఈ పిటిషన్పై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, మెజారిటీ స్థానాల్లో నామినేషన్ల పర్వం ముగిసి ఏకగ్రీవాలు కూడా ఖరారవుతున్న తరుణంలో.. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ తరఫు న్యాయవాదుల అభ్యర్థనను నిరాకరిస్తూ.. “ఆల్ ది బెస్ట్.. ఎన్నికలకు వెళ్ళండి” అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం విశేషం. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ముగిసిన తర్వాత చట్టపరంగా తదుపరి చర్యలు చూసుకోవచ్చని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
అయితే, ఎన్నికల పారదర్శకతకు సంబంధించి సుప్రీంకోర్టు ఏపీ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగాలని స్పష్టం చేస్తూ.. పోలింగ్ కేంద్రాలతో పాటు మొత్తం ఎన్నికల ప్రక్రియను సీసీ (CC) కెమెరాల నిఘాలో పర్యవేక్షించాలని ఆదేశించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక పోరులో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఊపందుకుంది.








