Congress: కాంగ్రెస్ ‘మిషన్ 100’..!
తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ట్రై చేస్తోంది. క్షేత్రస్థాయి సమీకరణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సంస్థాగత బలాన్ని నమ్ముకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘100 సీట్లు’ సాధించడమే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ఇదే విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగిన ఆయన.. కాంగ్రెస్ పునరాగమనంపై తిరుగులేని ధీమాను వ్యక్తం చేశారు.
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గ్రౌండ్ రియాలిటీని విస్మరించి బతుకుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా అధికార దర్పం తాలూకు భ్రమల్లోనే ఉన్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులకు కారణమైన ప్రకృతి విపత్తు ఎల్ నినో ప్రభావాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ హరీష్ రావు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను అందరూ మేధావి అనుకుంటారని, కానీ భవిష్యత్తుపై కనీస ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే ఆయనని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రస్తుత పాలనాపరమైన, ప్రజల సమస్యలన్నింటికీ నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి పరిష్కారం లభిస్తుందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. నవంబర్ తర్వాత నుంచి కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయి ఎన్నికల మోడ్‌లోకి వెళ్లనున్నాయి. ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రౌండ్లో దూకుడు పెంచారని, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఆదరణకు నిదర్శనమని గుర్తుచేశారు. “ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజా క్షేత్రంలో నిలిచే పార్టీ మాత్రమే శాశ్వతం. కాంగ్రెస్‌కు ఉన్న అసలైన బలం దాని సంస్థాగత పునాదే” అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సమన్వయంపై వస్తున్న ఊహాగానాలకు మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా చెక్ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల్లో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడి మధ్య ప్రస్తుతం ఉన్నంతటి పరస్పర సమన్వయం, సయోధ్య దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదని స్పష్టం చేశారు. నాయకుల మధ్య అంతర్గత కలహాలకు తావులేకుండా ఒకే తాటిపై నడుస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీపై పీసీసీ చీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రస్తుతం బీజేపీకి ఉన్న 8 మంది లోక్‌సభ ఎంపీల్లో ఇద్దరు గెలిస్తేనే ఎక్కువని, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా తిరిగి గెలవరని జోస్యం చెప్పారు. ముఖ్యంగా బీజేపీ బలంగా భావించే ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కనీసం 40 శాతం అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని తన సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. అర్హులైన పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ, వేలాది మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో లబ్ధిదారులంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. ఇప్పటికే అందించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులైన యువతకు అందించిన దాదాపు 90 వేల ఉద్యోగాలే తమకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్‌ను మళ్లీ తిరుగులేని మెజారిటీతో గద్దెనెక్కిస్తాయని, 100 స్థానాల విజయమే తమ అంతిమ లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు.








