ఎయిర్ ఇండియా, ఇండిగోలకు పెద్ద దెబ్బ..గ్యాప్ లో యూరప్ ప్లైట్స్ దే హవా!
ఎయిర్ లైన్స్ బిజినెస్ లో మనకి బయటికి కనిపించే మెరుపులు వేరు… లోపల ఉండే అసలు లెక్కలు వేరు! మనం విమానం ఎక్కి కూర్చున్నప్పుడు చుట్టూ విమానాలు, హడావిడిగా జనాలు కనిపిస్తే “అబ్బో, కంపెనీకి లాభాల పంట పండుతోందిలే” అనుకుంటాం. కానీ, సీన్ కట్ చేస్తే… కథంతా రివర్స్!
ఒకప్పుడు విదేశాలకు వెళ్లాలంటే కళ్లు మూసుకుని ఎయిర్ ఇండియాలోనో, ఇండిగోలోనో టికెట్ బుక్ చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన ప్రయాణికులను విదేశీ సంస్థలు ఎగరేసుకుపోతున్నాయి. మన భారతీయ విమానయాన సంస్థలు ఇంధనం ధరలు, రూపాయి పతనంతో ఖర్చులు తట్టుకోలేక అంతర్జాతీయ సర్వీసులను కుదించుకుంటూ వెనక్కి తగ్గుతుంటే… అదే గ్యాప్‌లో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి యూరోపియన్ సంస్థలు మనదేశంలో జెండా పాతేస్తున్నాయి. అసలు మనోళ్లు ఎందుకు వెనకబడుతున్నారు? విదేశీ సంస్థలకు ఇది ఎలా పండగలా మారింది?
టికెట్ ధరలు పెంచలేరు.. ఖర్చులను తగ్గించుకోలేరు!
ఈ విమానాల బిజినెస్ చాలా విచిత్రమైనది. విమానం నిండుగా ప్రయాణించినంత మాత్రాన కంపెనీకి లాభాలు వచ్చేస్తాయనుకుంటే పొరపాటే! ఎందుకంటే డాలర్లతో ముడిపడి ఉన్న విమాన ఇంధనం, లీజు వాయిదాలు, నిర్వహణ, విమానాశ్రయ ఛార్జీలు, సిబ్బంది జీతాలు.. ఇలా ఖర్చుల జాబితా కొండంత ఉంటుంది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 7 శాతం పడిపోవడం, విమాన ఇంధన ధరలు ఒక్కసారిగా మండిపోవడంతో మన సంస్థల నడుము విరిగింది.
మరి ఈ పెరిగిన భారాన్ని ప్రయాణికులపై వేద్దామా అంటే… టికెట్ ధరలు పెంచితే ప్రయాణికులు వెంటనే ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతారు. అలాగని ఖర్చులు తగ్గించుకోలేరు. అందుకే లాభాలు లేక, భారం మోయలేక కొన్ని రూట్లలో సర్వీసులను ఎత్తేయడం లేదా కుదించడం తప్ప మన సంస్థలకు వేరే దారి లేకపోయింది.
ఎయిర్ ఇండియా ఖాళీ చేసిన చోట.. విదేశీ సంస్థల హడావుడి!
ఈ ప్రభావం ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా, యూరప్‌లలోని ప్రధాన నగరాలకు హవా నడిపిన ఎయిర్ ఇండియా, ఇప్పుడు సైలెంట్‌గా వెనక్కి తగ్గుతోంది. ఈ శీతాకాలంలో వియన్నా, కోపెన్హాగన్లకు విమానాలను పూర్తిగా నిలిపివేస్తూ, బర్మింగ్‌హామ్, లండన్ గాట్విక్ మార్గాల్లో సర్వీసులను తగ్గించింది.
చివరికి ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వారానికి 10 సార్లు వెళ్లే విమానాలను కేవలం 3 సార్లకు పరిమితం చేసింది. అమృత్సర్ నుంచి లండన్ సర్వీసులు ఆపేయడంతో పాటు కొచ్చి, గోవా వంటి నగరాల నుంచి లండన్ కనెక్టివిటీకి కోతలు పెట్టింది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే… ఎయిర్ ఇండియా విమానాలు తగ్గించినంత మాత్రాన ఉద్యోగాలు, చదువులు, బిజినెస్ పనులపై విదేశాలకు వెళ్లే మనవాళ్లు ప్రయాణాలు ఆపుకోరు కదా! సరిగ్గా ఈ ఖాళీనే అవకాశంగా మలుచుకుని యూరోపియన్ విమానయాన సంస్థలు ఆ ప్రయాణికులను తమవైపు తిప్పుకుంటున్నాయి.
లుఫ్తాన్సా వేస్తున్న పక్కా స్కెచ్
మన సంస్థలు షెడ్యూళ్లను కుదించుకుంటుంటే, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా మాత్రం భారత్ మార్కెట్‌పై కన్నేసింది. ఈ ఏడాది ఆసియా మార్గాల్లో తమకు వచ్చిన సగటు ఆదాయం (యీల్డ్స్) 13 శాతం పెరిగిందని, అందులో భారత్ పాత్రే కీలకమని ఆ సంస్థ తేల్చి చెప్పింది. అందుకే రాబోయే వేసవి సీజన్ నాటికి మన దేశంలో మరింతగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
మ్యూనిక్ నుంచి ఢిల్లీకి రెండో రోజువారీ విమానాన్ని అందుబాటులోకి తెస్తూ, ఫ్రాంక్ఫర్ట్ నుంచి చెన్నైకి ప్రతిరోజూ, అలాగే హైదరాబాద్, బెంగళూరులకు వారానికి ఆరు సార్లు విమానాలు నడపాలని నిర్ణయించింది. అంటే మనోళ్లు కష్టాల్లో ఉన్నారని వెనక్కి తగ్గకుండా, డిమాండ్ ఉన్న చోట నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోవడమే దాని వ్యూహం.
ఇండిగో పెద్ద విమానాలతో వచ్చేలోపే తీవ్ర పోటీ!
ఇండిగో కూడా సుదూర ప్రాంతాలకు సర్వీసులు అందించేందుకు 60 ఎయిర్‌బస్ A350 వైడ్-బాడీ విమానాలను ఆర్డర్ ఇచ్చి, రేసులోకి రావాలని చూస్తోంది. కానీ ఆ విమానాలు ల్యాండ్ అయ్యేలోపే యూరోపియన్ సంస్థలు మార్కెట్‌ను చుట్టేస్తున్నాయి. లుఫ్తాన్సాతో పాటు బ్రిటిష్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ ఇప్పటికే భారత్-లండన్ మార్గంలో అదనపు విమానాలతో సిద్ధమయ్యాయి.
ఇండిగో పెద్ద విమానాలతో అంతర్జాతీయ రంగానికి పరిచయమయ్యే నాటికే, అక్కడ నిలదొక్కుకున్న విదేశీ సంస్థలు బలమైన నెట్వర్క్, భాగస్వామ్యాలతో గట్టి పోటీని ఇచ్చేందుకు కాచుకుని కూర్చున్నాయి. రాబోయే రోజుల్లో ఇండిగో ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ లాభాలు సాధించడం ఒక పెద్ద సవాలే.
ప్లానింగ్ లోపాలు.. గగనతల ఆంక్షల దెబ్బ
విదేశీ విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను, కనెక్టింగ్ టైమ్‌లను నెలల ముందుగానే చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటాయి. కానీ మన భారతీయ సంస్థలు మాత్రం చివరి నిమిషంలో విమానాలను రద్దు చేయడం లేదా హఠాత్తుగా సర్వీసులను మార్చడం లాంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. నెలల ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ప్రయాణికులకు ఇది తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది.
దీనికితోడు పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించడంపై ఉన్న పరిమితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మన విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన ఖర్చు, ప్రయాణ సమయం రెండూ పెరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని విదేశీ సంస్థలకు ఈ మార్గాల్లో కొంత వెసులుబాటు ఉండటం వల్ల ఖర్చుల పరంగా వాటికి కాస్త కలిసి వస్తోంది.
మన విమానయాన హబ్ కల నెరవేరేనా?
భారత్‌ను ఒక అంతర్జాతీయ విమానయాన హబ్‌గా మార్చాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. కానీ కేవలం ఎయిర్‌పోర్టులను రంగురంగులుగా తీర్చిదిద్ది, రన్‌వేలను విస్తరిస్తే సరిపోదు. ఆ ఎయిర్‌పోర్టుల నుంచి ప్రపంచ నగరాలకు నిరంతరాయంగా, తక్కువ ఖర్చుతో విమానాలను నడపగలిగే బలమైన సొంత విమానయాన సంస్థలు మనకు ఉండాలి.
విదేశీ సంస్థలు తమ సర్వీసులను పెంచడం వల్ల ప్రయాణికులకు ఆప్షన్లు పెరగడం మంచిదే కావచ్చు, కానీ మన మార్కెట్ నుంచి వచ్చే అసలైన ఆదాయం మాత్రం విదేశీ కంపెనీల ఖాతాల్లోకే వెళ్తోంది. భారతీయ ప్రయాణికులు పెరగడం ఒకెత్తయితే… ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే బలం మన సొంత విమానయాన సంస్థలకు ఎంతవరకు ఉందనేదే ఇక్కడ అసలైన ప్రశ్న!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








