అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం.. 32 వేల మంది అధికారులతో సీఎం అత్యవసర రివ్యూ
అర్నబ్ అతి తీవ్ర తుపాను పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ (RTGS) , వివిధ జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, ఆరఅండ్బీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సహా మొత్తం 32 వేల మందితో టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. తుపాను తీవ్రతకు పంటలకు వాటిల్లిన భారీ నష్టం, ప్రాథమిక అంచనాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 8వేల హెక్టార్లలో కొబ్బరి, 5వేల హెక్టార్లలో అరటి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. తుపానుతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లేలా సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలపై అభినందించారు.
తుపాను ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. కూలిన చెట్ల తొలగింపు నుంచి విద్యుత్ పునరుద్ధరణ, పంట నష్టం అంచనాల వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రాత్రంతా కష్టపడి పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సూచించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడంతోపాటు ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించాలని ఆదేశించారు. రహదారులపై కూలిన చెట్లను రెండు గంటల్లోగా తొలగించి రాకపోకలను పునరుద్దరించాలని, జాతీయ రహదారుల (National Highways)పై చెట్లు పడితే తక్షణమే తొలగించాలని దిశానిర్దేశం చేశారు. ఈదురుగాలులు, తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.








