అమెరికన్ వ్యాపార సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి వారధిగా పనిచేయడమే నా బాధ్యత : సతీష్ మండువ
అమెరికన్ వ్యాపార సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడమే తన బాధ్యత అని ఏపీ పెట్టుబడుల కోసం నార్త్ అమెరికా ప్రిన్సిపల్ లైజన్ గా నియమితులైన సతీష్ మండువ ప్రకటించారు. తనపై నమ్మకం వుంచిన సీఎం చంద్రబాబుకి, ఐటీ మంత్రి నారా లోకేశ్ కి ధన్యవాదాలు ప్రకటించారు. అక్టోబర్ 25 వ తేదీన సతీష్ మండువ సన్మాన కార్యక్రమం డల్లాస్ లో జరిగింది.ఈ సన్మాన కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, ఎంట్రప్రెన్యూర్లు, సామాజిక నేతలు హాజరయ్యారు. అమెరికన్ కంపెనీలను ఏపీలోని పెట్టుబడి అవకాశాలతో అనుసంధానించడం అనే ఉమ్మడి లక్ష్యంతో తెలుగు ప్రవాసులు, విస్తృత వ్యాపార సమాజం ఒకే వేదికపైకి వచ్చారు.
ఈ సందర్భంగా సతీష్ మండువ మాట్లాడుతూ కొత్త మార్కెట్ కోసం చూస్తున్న అమెరికన్ కంపెనీలకు వారధిగా నిలవడం, సరైన వ్యక్తులను ఒకే వేదిక వద్దకు తీసుకొచ్చి అవకాశాలు కల్పించడం, ఏపీకి సహజ భాగస్వాములైన ప్రవాసులకు అంగా నిలవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా ముందు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇక.. ఏపీలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో గూగుల్, 15 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న ఏఐ, డేటా సెంటర్ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ, శ్రీ సిటీలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ సంస్థలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో అనుమతులు, పారిశ్రామిక విధానంలోని ప్రోత్సాహకాలపై ఏపీ ప్రభుత్వం పెడుతున్న దృష్టిని కూడా వివరించారు.
కొన్ని వారాల్లోనే ఓ ఫార్చ్యూన్100 కంపెనీ, ఓ పెద్ద అంతర్జాతీయ సంస్థ ఉన్నతాధికారి, కొన్ని విశ్వవిద్యాలయాలతో సహా ప్రముఖ సంస్థలు తమతో సమావేశం అవుతున్నాయని, పెట్టుబడులకు సుముఖంగా వున్నాయన్నారు. పెట్టుబడుల కోసం, ఏపీ అభివృద్ధి కోసం అందరూ కలిసి నడవాలని పిలుపునిచ్చారు. తాను పెట్టుబడుల కోసం తలుపులు తెరువగలను కానీ.. ఏ తలుపు తట్టాలో మీకే బాగా తెలుసునన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇన్వెస్టర్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు.

ఇక.. తన ఈ బాధ్యతలో తోడుగా వుంటున్న వారిని కూడా సతీష్ మండువ పరిచయం చేశారు.
అనిల్ పాటిబండ్ల – హార్మోనియా హోల్డింగ్స్ మాజీ అధ్యక్షులు
కిషోర్ నక్కా, న్యూవిసో సీఈవో
కృష్ణ కుమార్, టెక్నాలజిస్ట్, మెక్సికో పెట్టుబడుల వ్యవహారాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నీలిమ గోనుగుంట్ల, యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు
సతీష్ నన్నపనేని : ఫ్లెక్సెరా గ్లోబల్ ఇంక్ సీఈవో
హోస్ట్ కమిటీకి ధన్యవాదాలు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హోస్ట్ కమిటీ సభ్యులు పద్మశ్రీ అశోక్ మాగోజీ, నీతి ఖైతాన్ఖ, డా. రాజు కోసూరి, మహేందర్ ఘనపురం, సునీల్ మైని, డా. ఉషా పేరి, అనిల్ పాటిబండ్ల, సంజయ్ జూపూడి, నీల్ గోనుగుంట్ల, కృష్ణ కొరాడాలకు మండువ ధన్యవాదాలు ప్రకటించారు. ఐటీ సర్వ్ మాజీ అధ్యక్షులు, యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డులోని సహచరులు, ఆటా, నాట్స్, ఐఏఎన్టీ, తానా, టీపాడ్, టాంటెక్స్, శుభం ఫౌండేషన్, ఐఏఎఫ్సీ, శంకర నేత్రాలయ, సిలికానాంధ్ర సంస్థల నాయకత్వానికి, హాజరైన అతిథులకు ధన్యవాదాలు ప్రకటించారు.








