రక్షణదళాల ఆధునికీకరణపై కేంద్రం ఫోకస్.. రూ.2.12 లక్షల కోట్ల కొనుగోళ్లకు డీఏసీ పచ్చజెండా..
ప్రస్తుతం ప్రపంచం అత్యంత తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఎటు చూసినా ఏదో రకమైన అనిశ్చితి.. యుద్దవాతావరణం కనిపిస్తోంది. దీంతో పలుదేశాలు తమ రక్షణ బడ్జెట్ ను అమాంతం పెంచేశాయి. ఇదే తరుణంలో ఇండియా కూడా…. సైనిక ఆధునికీకరణకు పెద్దపీట వేస్తోంది.సైనిక దళాల ఆధునికీకరణకు భారీగా ఊతమిస్తూ రూ.2.12 లక్షల కోట్ల ఆయుధ సమీకరణకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) పచ్చజెండా ఊపింది. ఇందులో బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్లు, రాడార్లు వంటివి ఉన్నాయి. ఈ ఆయుధ వ్యవస్థల్లో 82 శాతాన్ని భారత పరిశ్రమల నుంచే సమీకరిస్తారు.
సైన్యం కోసం..
హై మొబిలిటీ వెహికల్స్ (హెచ్ఎంవీలు), సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రాక్డ్ గన్ సిస్టమ్, గన్ షూట్ రెస్పాన్స్ సిస్టమ్ (జీఎస్ఆర్ఎస్), తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీషోరడ్స్), కౌంటర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ (సీ-యూఏఎస్), మానవరహిత వైమానిక వ్యవస్థలు, గగనతల నిఘా విమానాలు, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ స్ట్రైక్ సిస్టమ్, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్ వ్యవస్థలను సేకరిస్తారు.
ఎగుడుదిగుడు భూభాగాల్లో బలగాల తరలింపు, పోరాటం, వస్తువుల రవాణాకు హెచ్ఎంవీలు ఉపయోగపడతాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రాక్డ్ గన్ సిస్టమ్.. ట్యాంక్ దళాల పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. జీఎస్ఆర్ఎస్.. యుద్ధరంగ తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు సైనికాధికారులకు అవగాహన కల్పిస్తుంది. వీషోరడ్స్.. చిన్నపాటి కొత్తతరం డ్రోన్లను నేలకూలుస్తాయి. సీ-యూఏఎస్లు శత్రు డ్రోన్ దాడుల నుంచి ట్యాంకులకు రక్షణ కల్పిస్తాయి.
నౌకాదళం కోసం..
నేవీ కోసం యాక్టివ్ ఆఫ్బోర్డ్ డికాయ్ సిస్టమ్ (ఏవోడీఎస్) కొనుగోలుకు ఆమోదం లభించింది. ఇది క్షిపణి రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనికితోడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన పలు నౌకాదళ వ్యవస్థల సమీకరణకూ ఆమోదం లభించింది.
వాయుసేనకు..
హెలికాప్టర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, వాతావరణ పరిస్థితులపై కన్నేసి ఉంచే సంచార ఎక్స్-బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ వ్యవస్థల సమీకరణకు డీఏసీ సమ్మతించింది.








