అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ విపక్షనేత బొల్సనారో …!
బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ మద్దతుదారు ఫ్లేవియో బొల్సనారో (Flavio Bolsonaro).. అమెరికా పరారయ్యారు. మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) దర్యాప్తునకు సంబంధించిన అరెస్ట్ భయంతో తన పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలన్న బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అమెరికాకు పారిపోయారు. ఫ్లావియో బొల్సనారోపై బ్రెజిల్లో తీవ్రమైన మనీలాండరింగ్ (అక్రమ ధనార్జన) ఆరోపణలు ఉన్నాయి. బ్రెజిల్ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ మోసానికి పాల్పడిన ఒక బ్యాంకర్ నుంచి తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు ఆయన కోట్లాది రూపాయల నిధులు సేకరించారని, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని ఫెడరల్ పోలీసులు చెబుతున్నారు.
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఉండటంతో ఆయనపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లవద్దని.. పాస్‌పోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టారు. కుటుంబంతో కలిసి అమెరికాకు పారిపోయారు. ఈ మేరకు అమెరికా (USA) మీడియా వర్గాలు కథనాలు వెలువరించాయి. ఆయన ప్రస్తుతం దక్షిణ ఫ్లోరిడాలో ఉన్నట్లు సమాచారం. గడువులోగా పాస్‌పోర్టు అప్పగించకపోవడంతో బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో సహా అన్ని పత్రాలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బొల్సనారోకు, ఆయన కుటుంబానికి వీసాలు జారీ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
బ్రెజిల్ ఎన్నికల్లో విజయం సాధించిన వామపక్ష లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా.. బొల్సనారోపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి అనంతరం విదేశాలకు పారిపోవడం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. దేశం నుంచి రహస్యంగా బయటకు వెళ్లి ఏదో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
బ్రెజిల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 81 ఏళ్ల లులాకు 44 లక్షల ఓట్ల మెజారిటీ దక్కింది. 51.8 శాతం ఓట్లను ఆయన సాధించారు. బొల్సనారోకు 48.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.








