అమిత్ షా రాకతో బీజేపీ ప్లాన్ ఛేంజ్..!?
హైదరాబాద్‌లో నవంబర్ 2న నిర్వహించ తలపెట్టిన బీజేపీ మహా పాదయాత్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలను మార్చుకుంటోంది. తొలుత అనుకున్నట్టు ట్యాంక్ బండ్ పై మహా పాదయాత్ర కాకుండా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
తొలుత ట్యాంక్‌బండ్ కేంద్రంగా ఈ పాదయాత్రను చేపట్టాలని బీజేపీ నాయకులు భావించారు. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటుండటంతో భద్రతా పరమైన నిబంధనలు, పరిపాలనాపరమైన అనుమతులు అత్యంత కీలకంగా మారాయి. ట్యాంక్‌బండ్ ప్రాంతంలో రోజూ ఉండే రద్దీ, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చే కార్యకర్తలు, అభిమానుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రూట్‌ను మార్చే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. అమిత్ షా భద్రతకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదే సమయంలో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు.
పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన ప్రాంతాల కోసం పార్టీ ముఖ్య నేతలు అన్వేషణ సాగించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను పరిశీలించినట్లు సమాచారం. ఈ ప్రాంతం అయితే భారీ జనసమీకరణకు, ట్రాఫిక్ నియంత్రణకు, భద్రతా ఏర్పాట్లకు మరింత అనుకూలంగా ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండి కూటమి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే ఈ మహా పాదయాత్ర ప్రధాన లక్ష్యం. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడం, వాస్తవాలను వివరించడం, విపక్షాల అసత్య ప్రచారాన్ని ఎండగట్టడం ఈ యాత్ర ద్వారా చేయాలని బీజేపీ భావిస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అమిత్ షా రాకతో ఈ మహా పాదయాత్రను కేవలం ఒక నిరసన కార్యక్రమంగా కాకుండా, రాష్ట్రంలో పార్టీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే బలమైన వేదికగా మలచాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే, పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఏ ఏ వీధుల గుండా సాగుతుంది? బహిరంగ సభ వేదిక ఎక్కడ ఖరారవుతుంది? అనే విషయాలపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








