టీటీడీ చైర్మన్..? రేసులో ఆ ఇద్దరు సీనియర్లు..?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి పదవీకాలం నేటితో అధికారికంగా ముగియనుంది. గతేడాది నవంబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రస్తుత బోర్డు గడువు ముగియడంతో నూతన పాలకమండలి ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎన్నికల కోడ్) అమల్లో ఉన్నందున, ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి కొత్త బోర్డును ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో, నూతన బోర్డు నియామకం జరిగే వరకు తిరుమల ఆలయ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి తాత్కాలికంగా ఒక ‘స్పెసిఫైడ్ అథారిటీ’ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ అథారిటీ తాత్కాలికంగా బోర్డు బాధ్యతలను చూసుకోనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే కూటమి ప్రభుత్వం నూతన పాలకమండలిపై అధికారిక నిర్ణయం తీసుకుని, జీవో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, టీటీడీ తదుపరి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జగ్గంపేట ఎమ్మెల్యే, ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూతో పాటు మాజీ మంత్రి, మాజీ టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఈ ప్రతిష్టాత్మక చైర్మన్ రేసులో ముందంజలో ఉన్నారు. వీరి సీనియారిటీ, ఉత్తర కోస్తా మరియు గోదావరి జిల్లాల ప్రాంతీయ సమీకరణాలను బట్టి చంద్రబాబు నాయుడు నూతన చైర్మన్‌ను ఖరారు చేయనున్నారు. అదే సమయంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా ఈ కొత్త బోర్డులో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.








