మియాపూర్ భూములు.. కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో రూ. 50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ కబ్జాలు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి అద్భుతమైన విజయం దక్కిందని, ఈ భూముల పరిరక్షణకు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌లు మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని సీఎం ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే దామోదర్ రావుకు విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారని, కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందాయని విమర్శించారు. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా తాను ఈ కబ్జా వ్యవహారాలపై గట్టిగా పోరాడటంతోనే తనపై కక్షగట్టి అప్పట్లో జైలుకు పంపారని గుర్తుచేశారు. ఈ భూముల రక్షణ కోసం ప్రభుత్వం తరఫున అత్యంత బలమైన వాదనలు వినిపించామని, అందుకే తీర్పు అనుకూలంగా వచ్చిందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కేవలం మియాపూర్ మాత్రమే కాకుండా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఐఎంజీ భూములు, కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి, గుర్రంగూడ అటవీ భూములు, మంచిరేవుల (143 ఎకరాలు), జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని భూ ఆక్రమణలపై న్యాయపోరాటం చేసి వాటిని రక్షించినట్లు వివరించారు. మంచిరేవుల భూమిలో పోలీసుల పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేశామని తెలిపారు.
మియాపూర్ భూముల విక్రయం ద్వారా వచ్చే భారీ నిధులను నీటిపారుదల, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి, అలాగే శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మాణానికి వెచ్చిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ అంశంపై త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని, వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఈ భూముల విక్రయంపై అధ్యయనం చేస్తుందని చెప్పారు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూముల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావులు.. అధికారంలోకి వచ్చాక ఆరోపణలు ఎదుర్కొన్నవారితోనే లాలూచీ పడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా తమ కుట్రలు మాని, అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు.








