మియాపూర్ భూములు ప్రభుత్వానివే.. సుప్రీంకోర్టు తీర్పు
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దశాబ్దాలుగా నలుగుతున్న భారీ భూ వివాదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెరపడింది. మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో విస్తరించి ఉన్న సుమారు 550.39 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.60 వేల కోట్ల పైచిలుకు విలువైన ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ యంత్రాంగానికి భారీ ఊరట లభించినట్లయింది.
1912లో నిర్వహించిన సర్వే ప్రకారం సర్వే నంబర్ 100లోని 277.05 ఎకరాలు, సర్వే నంబర్ 101లోని 273.34 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగా నమోదై ఉన్నాయి. అయితే కాలక్రమేణా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన కొందరు ప్రైవేటు వ్యక్తులు రికార్డులను తారుమారు చేసి, అక్రమంగా పట్టాలు సృష్టించేందుకు యత్నించారు. 1995లో ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్-1982 కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన ప్రైవేటు వ్యక్తుల క్లెయిమ్‌లను ఆ కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ కొందరి అక్రమ ప్రయత్నాలు ఆగలేదు. ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా, కేవలం ఎంట్రీల ద్వారా రికార్డుల్లో పేర్లు మార్చేసి విలువైన భూమిని కాజేయాలని చూశారని సుప్రీంకోర్టు తన తీర్పులో తప్పుబట్టింది.
ప్రైవేటు వ్యక్తులు దిగువ కోర్టు తీర్పులను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, 2003లో హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ వాదననే బలపరిచింది. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ భూముల అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేలా సమర్థమైన వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.
తాజాగా జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 44 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పును వెలువరించింది. ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండా కేవలం రెంట్ ఎంట్రీల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు ఇవ్వడం చెల్లదని స్పష్టం చేసింది. ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరా రూ.100-120 కోట్ల వరకు ఉండగా, మొత్తం 550 ఎకరాల భూమి విలువ దాదాపు రూ.50-60 వేల కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మియాపూర్ భూముల వద్దకు చేరుకుని అధికారికంగా బోర్డులు ఏర్పాటు చేసి భూముల పరిరక్షణ చర్యలను ప్రారంభించారు.








