ఢిల్లీ సభకు కదం తొక్కుతున్న కాంగ్రెస్ శ్రేణులు!
నవంబర్ 1న ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న భారీ ర్యాలీకి తెలంగాణ నుంచి హస్తం పార్టీ నుంచి పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇండీ కూటమి చేపడుతున్న ఈ ర్యాలీకి అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలి రావాలని హైకమాండ్ ఆదేశించింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ .. అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలివెళ్తున్నాయి.
ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి కనీసం 15 వేల మందికి పైగా పార్టీ క్యాడర్ను తరలించాలని పీసీసీ నాయకత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ భారీ జనసమూహాన్ని తరలించేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను కేటాయించాలని రైల్వే శాఖను కోరినప్పటికీ, అనుమతి లభించలేదు. అయినప్పటికీ వెనుకంజ వేయని కాంగ్రెస్ నాయకత్వం, ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలులోకి తెచ్చింది. రైళ్లు దొరకని నేపథ్యంలో రోడ్డు మార్గాన్ని ఎంచుకుని, వందలాది ప్రత్యేక బస్సులను, విమాన టికెట్లను ముందుగానే బుక్ చేసుకుని ప్రయాణాలను సిద్ధం చేసింది.
తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం నుంచి క్యాడర్ను ఢిల్లీకి చేరవేయడానికి పీసీసీ నాయకులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా ఇంచార్జ్లు ఈ ప్రయాణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 150 బస్సులలో కాంగ్రెస్ శ్రేణులు నాగపూర్ మీదుగా రోడ్డు మార్గంలో బయలుదేరాయి. నాగపూర్ లో భోజనాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఆగ్రా మీదుగా ఢిల్లీకి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బస్సులు, ఇతర వాహనాలలో శ్రేణులు తరలివెళ్తున్నాయి.
ఈ భారీ ప్రయాణాన్ని విజయవంతం చేయడానికి పీసీసీ ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని నియమించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీతక్క తదితర ముఖ్య నేతలు ఈ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. బస్సుల కేటాయింపు, ప్రయాణ మార్గంలో భోజన వసతి, వైద్య సౌకర్యాలు, ఢిల్లీలో బస చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. రైల్వే శాఖ నుంచి సహకారం లభించకపోయినా, కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ మార్కాల ద్వారా క్యాడర్ను తరలిస్తుండటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది.








