ఎన్నికల క్లైమాక్స్‌లో ట్రంప్ షాకింగ్ డెసిషన్…ఫోన్ కాల్స్ వెనుక అసలు విషయం ఏమిటి?
ఏ ఎన్నికల ప్రచారంలో అయినా చివరి రోజులు చాలా కీలకం. ముఖ్యంగా ఓటింగ్‌కు సమయం దగ్గరపడుతున్నప్పుడు అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తారు. ఇప్పటివరకు తమకు మద్దతుగా ఉన్నవారిని ఓటు వేయడానికి సిద్ధం చేయడం, తటస్థంగా ఉన్నవారిని ఆకర్షించడం, ఇంకా నిర్ణయం తీసుకోని ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం ప్రతి నిమిషాన్నీ ఉపయోగించుకుంటారు. అందుకే ఎన్నికల చివరి దశలో భారీ బహిరంగ సభలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
ఒక భారీ ర్యాలీ అంటే కేవలం నాయకుడు వచ్చి ప్రసంగించి వెళ్లిపోవడం కాదు. వేలాది మంది కార్యకర్తలను ఒకచోట చేర్చి పార్టీ బలాన్ని ప్రదర్శించడం, టీవీలు, సోషల్ మీడియా ద్వారా మరింతమందికి ప్రచారాన్ని చేరవేయడం, అభ్యర్థుల్లో ఉత్సాహం నింపడం.. ఇలా ఒకే సభతో అనేక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా గట్టి పోటీ ఉన్న రాష్ట్రాల్లో అగ్ర నాయకుల పర్యటనలు స్థానిక అభ్యర్థులకు అదనపు ప్రచార బలాన్ని ఇస్తాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇలాంటి సభల విలువ మరింత పెరుగుతుంది.
కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పుడు ఈ సంప్రదాయ ప్రచారానికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజులే సమయం ఉన్న తరుణంలో కాన్సాస్, అయోవా రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన తన బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వాటి స్థానంలో దాదాపు 20 రాష్ట్రాల్లో ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఒకప్పుడు భారీ జనసమూహాల మధ్య ప్రసంగాలతో ఎన్నికల ప్రచారానికి కొత్త ఊపు తీసుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు సభల సంఖ్య తగ్గించి టెలిఫోన్ ర్యాలీలను ఎంచుకోవడం చర్చనీయాంశమైంది.
ఇది కేవలం ప్రచార షెడ్యూల్లో మార్పా? లేక చివరి రోజుల్లో సమయాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలన్న వ్యూహమా? మరోవైపు కీలక రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులకు సర్వేల్లో కనిపిస్తున్న ఆధిక్యం, రిపబ్లికన్ పార్టీలోని అంతర్గత విభేదాలు ఈ పరిణామాలకు మరింత ఆసక్తిని జోడిస్తున్నాయి.
ర్యాలీలు రద్దు.. 20 రాష్ట్రాలకు ఫోన్ ప్రచారం!
ఈ వారాంతంలో కాన్సాస్‌లోని సలీనా, అయోవాలోని డబ్యూక్ నగరాల్లో ట్రంప్ బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ రెండు కార్యక్రమాలనూ రద్దు చేస్తున్నట్లు రిపబ్లికన్ నేషనల్ కమిటీ ప్రకటించింది. వాటి స్థానంలో ఫోన్ ద్వారా నిర్వహించే ‘టెలిర్యాలీల’లో ట్రంప్ పాల్గొంటారని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
రిపబ్లికన్ పార్టీకి కాన్సాస్, అయోవా రాష్ట్రాల్లో మంచి పరిస్థితి ఉందని, అందుకే ముందుగా అనుకున్న ప్రత్యక్ష సభలు నిర్వహించడం లేదని పార్టీ వివరణ ఇచ్చింది. అయితే ఎన్నికల సర్వేలు మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ అంత సులభంగా లేదని సూచిస్తున్నాయి.
కాన్సాస్‌లో రిపబ్లికన్ సెనేటర్ రోజర్ మార్షల్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కొన్ని సర్వేల్లో మార్షల్ వెనుకబడినట్లు కనిపించగా, CNN సర్వే కూడా ఈ పోటీని హోరాహోరీగా పేర్కొంది. అయోవాలో రిపబ్లికన్ అభ్యర్థి యాష్లే హిన్సన్, డెమోక్రటిక్ అభ్యర్థి జోష్ టురెక్ మధ్య పోటీ కొనసాగుతోంది.
అయితే కాన్సాస్కు ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు ప్రశ్నించినప్పుడు, అక్కడి రిపబ్లికన్ అభ్యర్థి బాగానే ఉన్నారని, తాను ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేదని ట్రంప్ సమాధానమిచ్చారు.
అక్టోబర్ 1 నుంచి ట్రంప్ ఇప్పటికే 19 రాష్ట్రాల్లో 25 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మిగిలిన ప్రచార సమయాన్ని మరిన్ని రాష్ట్రాలకు చేరుకునేందుకు ఉపయోగించాలన్నది టెలిర్యాలీల వెనుక ఉన్న వ్యూహంగా రిపబ్లికన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ప్రచార కార్యక్రమాలు కాన్సాస్, అయోవాతో పాటు మిచిగన్, అలాస్కా, టెక్సాస్ వంటి కీలక రాష్ట్రాలకూ చేరనున్నాయి.
ట్రంప్ ప్రయాణాలపై ప్రశ్నలు.. ఆయన సమాధానం ఏమిటి?
వరుసగా భారీ సభల్లో పాల్గొనడం, గంటకు పైగా ప్రసంగాలు చేయడం వల్ల ట్రంప్ ప్రచార షెడ్యూల్‌పై కూడా చర్చ మొదలైంది. ఇటీవల మిసిసిపీలో జరిగిన సభలో మాట్లాడుతూ, ప్రతిరోజూ ర్యాలీలు నిర్వహించడానికి దేవుడు తన స్వరపేటికలను తయారు చేయలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ప్రయాణాలు, సుదీర్ఘ ప్రసంగాల ఒత్తిడి కూడా షెడ్యూల్ మార్పునకు కారణమా అన్న ప్రశ్నలు వచ్చాయి.
అయితే తన ఆరోగ్యం గురించి వచ్చిన ప్రశ్నలను ట్రంప్ తోసిపుచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. కాన్సాస్కు వెళ్లకపోవడానికి అనారోగ్యం కారణం కాదని, అక్కడి అభ్యర్థి పరిస్థితి బాగుందని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ మాత్రం ఫోన్ ర్యాలీల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ రాష్ట్రాల్లోని ఓటర్లను చేరుకోవచ్చని భావిస్తోంది.
డెమోక్రాట్లకు సర్వేల్లో ఊరట.. రిపబ్లికన్లకు కీలక పరీక్ష
ఈ ఎన్నికల్లో అసలు ఆసక్తి రేపుతున్న అంశం కీలక రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులు. ముఖ్యంగా ధరల పెరుగుదల, ఆర్థిక పరిస్థితి, ఇంధన ఖర్చులు వంటి అంశాలు ఓటర్ల చర్చల్లో ప్రధానంగా నిలుస్తున్నాయి. ట్రంప్ ఆర్థిక వ్యవస్థపై గతంలో ఉన్న విశ్వసనీయత తగ్గుతోందని కొన్ని సర్వే విశ్లేషణలు సూచిస్తున్నాయి.
మిచిగన్‌లో అబ్దుల్ ఎల్-సయీద్, టెక్సాస్‌లో జేమ్స్ తలారికో తమ ప్రత్యర్థులతో గట్టి పోటీలో ఉన్నారు. CNN విడుదల చేసిన అక్టోబర్ 29 సర్వేల్లో ఈ ఇద్దరు డెమోక్రటిక్ అభ్యర్థులకు స్వల్ప ఆధిక్యం కనిపించింది. మైనే, కాన్సాస్‌లలో మాత్రం స్పష్టమైన ఆధిక్యం ఎవరికీ లేదు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డెమోక్రటిక్ పార్టీకి మొత్తంగా ప్రజాదరణ అంతగా లేకపోయినా, కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం మంచి పోటీ ఇస్తున్నారు. గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన యువత, హిస్పానిక్ ఓటర్లలో ఆయన ఆమోద రేటింగ్ తగ్గుతోందన్న విశ్లేషణలు కూడా రిపబ్లికన్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.
మిచిగన్‌లో డెమోక్రాట్ల మధ్యే విభేదాలు!
ఒకవైపు రిపబ్లికన్లకు ఎన్నికల సవాళ్లు ఎదురవుతుంటే, మరోవైపు డెమోక్రటిక్ పార్టీలోనూ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. మిచిగన్ సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన ప్రతినిధి హేలీ స్టీవెన్స్ కాబోయే భర్త జేసన్ టర్కిష్ రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు ఓటు వేస్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఇజ్రాయెల్‌పై ఎల్-సయీద్ చేసిన విమర్శలు, యూదు వ్యతిరేకత అంశంపై ఆయన స్పందనపై కొందరు యూదు డెమోక్రాట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే యూదు ప్రజలను వ్యతిరేకించడం కాదని ఎల్-సయీద్ చెబుతున్నారు.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇలాంటి విభేదాలు బయటపడటం పార్టీకి మరో సవాలుగా మారింది.
అలాస్కాలో మరో వివాదం.. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నమా?
అలాస్కా సెనేట్ ఎన్నికల్లోనూ పేర్ల గందరగోళం చుట్టూ వివాదం నడుస్తోంది. డెమోక్రటిక్ అభ్యర్థి మేరీ పెల్టోలా ప్రచార బృందం, రిపబ్లికన్ సెనేటర్ డాన్ సుల్లివన్ పేరును పోలిన మరో అభ్యర్థిని ఎన్నికల బరిలోకి తీసుకురావడంలో సహకరించిందన్న ఆరోపణలు వచ్చాయి.
డాన్ జే. సుల్లివన్ జూనియర్ అనే మరో అభ్యర్థి పేరుతో ఓటర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగిందన్నది విమర్శకుల ఆరోపణ. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తానని అలాస్కా గవర్నర్ మైక్ డన్లీవీ ప్రకటించారు. అయితే తమ ప్రచార బృందానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని పెల్టోలా క్యాంపెయిన్ ఖండించింది.
ప్రచార బరిలో ప్రముఖ నేతలు
ఎన్నికల చివరి దశలో రెండు పార్టీలూ తమ ప్రముఖ నాయకులను ప్రచారానికి దింపుతున్నాయి. ట్రంప్ దక్షిణ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డార్లిన్ గ్రాహంకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టెక్సాస్‌లో కెన్ పాక్స్టన్ తరఫున ప్రచారం చేశారు. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ జార్జియాలో డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఒసాఫ్కు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక ఓహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి ప్రచార ప్రకటన కూడా వివాదానికి దారితీసింది. ప్రత్యర్థి అమీ ఆక్టన్ తల్లితో రూపొందించిన ప్రకటనపై విమర్శలు రావడంతో దాన్ని ప్రసారం చేయడం నిలిపివేస్తున్నట్లు రామస్వామి ప్రచార బృందం ప్రకటించింది.
మరోవైపు ఒబామా, ట్రంప్ మధ్య చీజ్‌కేక్ ఫ్యాక్టరీ గురించి సాగిన వ్యంగ్య వ్యాఖ్యల వివాదం కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ట్రంప్ రాజకీయ ప్రచార విభాగం ఒబామా ముఖంపై ట్రంప్ చీజ్‌కేక్ విసురుతున్నట్లుగా కనిపించే AI చిత్రాన్ని కూడా పోస్టు చేసింది.
చివరి రోజుల్లో ట్రంప్ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది?
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై నియంత్రణ ఎవరికి దక్కుతుందనేది కీలకమైన అంశం. ప్రతినిధుల సభ, సెనేట్‌లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీని నిలబెట్టుకోవడానికి ట్రంప్ స్వయంగా ప్రచార బాధ్యతను తీసుకున్నారు. అందుకే ఆయన గత కొన్ని వారాలుగా వరుస సభల్లో పాల్గొంటున్నారు.
అయితే ఇప్పుడు బహిరంగ సభల స్థానంలో ఫోన్ ర్యాలీలకు ప్రాధాన్యం ఇవ్వడం కొత్త చర్చకు తెరతీసింది. ఒకే వేదికపై వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా వచ్చే రాజకీయ ప్రభావం వేరు. ఫోన్ ద్వారా ఒకేసారి అనేక రాష్ట్రాలకు చేరుకోవడం ద్వారా వచ్చే ప్రచార విస్తృతి వేరు. ఈ రెండింటిలో ఏది చివరి రోజుల్లో ఎక్కువ ఉపయోగపడుతుందో ఎన్నికల ఫలితాలే స్పష్టం చేయనున్నాయి.
ట్రంప్‌కు ఈ ఎన్నికలు కేవలం రిపబ్లికన్ అభ్యర్థులను గెలిపించే పోరాటం మాత్రమే కాదు. తన రెండో అధ్యక్ష పదవిలో మిగిలిన రెండేళ్లకు కాంగ్రెస్‌లో రాజకీయ మద్దతు ఎంతవరకు కొనసాగుతుందో నిర్ణయించే పరీక్ష కూడా. అందుకే చివరి నిమిషంలో ఆయన ఎంచుకున్న ఈ ఫోన్ ప్రచార వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








