డెమోక్రటిక్ పార్టీ వైపు భారతీయ అమెరికన్లు.. తాజా సర్వే .. కారణం ఒక్కటే..
అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ కొత్త కోణం ఆవిష్కృతమైంది. భారతీయ అమెరికన్ ఓటర్లలో ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఓ తాజా సర్వే ప్రకటించింది. పెరుగుతున్న భారత వ్యతిరేక వాదనల నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా స్పష్టమవుతోంది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, ‘ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్’ అనే ప్రచార సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో, 2024లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసిన భారతీయ అమెరికన్లలో సుమారు 25 శాతం మంది, రాబోయే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తేలింది.
ఈ సర్వేలో పాల్గొన్న భారతీయ అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది కాంగ్రెస్, సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులకే ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. రిపబ్లికన్లు మాట్లాడే మాటల పట్ల అసంతృప్తి, వివక్ష గురించిన ఆందోళనలు సమాజంలోని రాజకీయ వైఖరులను కచ్చితంగా ప్రభావితం చేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ అన్నారు. భారతీయ అమెరికన్ ఓటర్లలో గణనీయమైన ఓటర్లు తాము తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాత్తాపపడుతున్నారని పటేల్ మీడియాతో పేర్కొన్నారు. ద్వేషం, వివక్ష వంటి అంశాల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ భావన వారి సమాజంలో క్రమంగా బలపడుతోంది.”అని కూడా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
అయితే.. ఈ సమస్యలపై ఆందోళన వారి మనస్సుల్లో వున్నా.. భారతీయ అమెరికన్ ఓటర్లు ఆర్థిక సమస్యలకు, ముఖ్యంగా జీవన వ్యయం మరియు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత అన్న అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని కూడా సర్వేలో తేలిపోయింది. ట్రంప్ తన రెండవ అధ్యక్ష పదవీ కాలంలో చూపిన పనితీరును పది మంది భారతీయ అమెరికన్లలో ఏడుగురు వ్యతిరేకించారని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
రిపబ్లికన్ అభ్యర్థులకు కాంగ్రెస్ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని 18 శాతం మంది, సెనెట్ ఎన్నికల్లో ఓటు వేస్తామని 22 శాతం మంది తెలిపారు. అయితే.. ఇరువురు కూడా ఆశించిన స్థాయిలో ప్రచారం, సంప్రదింపులు జరపనేలేదని ఓటర్లు పెదవి విరుస్తున్నారు. అయితే, డెమోక్రటిక్ పార్టీతో సమాజం యొక్క అనుబంధం తగ్గిందని కార్నెగీ సర్వే కూడా సూచించింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం, 2020తో పోలిస్తే, కేవలం 46% మంది భారతీయ అమెరికన్లు మాత్రమే తమను డెమోక్రాట్లుగా గుర్తించుకున్నారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ ఓటర్లలో సుమారు మూడవ వంతు మంది ట్రంప్‌కు మద్దతు తెలిపారు.
సెనేట్ రిపబ్లికన్ నాయకుడు మిచ్ మెక్కానెల్ వద్ద గతంలో పనిచేసిన, దీర్ఘకాల రిపబ్లికన్ వ్యూహకర్త అయిన అనంగ్ మిట్టల్, ‘ది వెర్జ్’తో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలను నిర్ణయించడానికి తగినంత బలం లేదని నమ్మడం వల్లే కొంత మంది రిపబ్లికన్ నేతలు భారతీయులకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు సహించడానికి సిద్ధంగా వున్నట్లు కనిపించారని చెప్పుకొచ్చారు. భారతీయ వలసదారులను బయటి వ్యక్తులుగా, అమెరికన్ సంస్కృతికి సరిపడని వారిగా చూపే భాషను ఉపయోగించినందుకు ఎటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదని వారు నిర్ణయించుకున్నారు,” అని కూడా మిట్టల్ అన్నారు.
హ్యూస్టన్ వ్యాపారవేత్త మరియు హిందూ అమెరికన్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడు అయిన రిషి భూతడ మాట్లాడుతూ, గతంలో రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చిన కొంతమంది ఓటర్లు ఇప్పుడు బ్యాలెట్‌లోని అన్ని స్థానాలకు డెమోక్రాట్లకు ఓటు వేయాలని ఆలోచిస్తున్నారని చెప్పారు.
“రిపబ్లికన్ పార్టీని తాము సహించబోమని సందేశం పంపడానికే, బ్యాలెట్‌లోని అన్ని స్థానాలకు డెమోక్రాట్లకే ఓటు వేయబోతున్నామని చెబుతున్న కొందరిని నేను చూశాను,” అని భూతడ అన్నారు.








