కారు ఖరీదు కాదు.. దాని నంబర్ ప్లేట్ ధరే రూ.15 కోట్లు! ఇదెక్కడి లగ్జరీరా బాబూ!
ఒక కారు కొనాలంటే కోట్లు ఖర్చు పెట్టేవాళ్లను చూశాం. కానీ కారులో ఉండే నంబర్ ప్లేట్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం గురించి విన్నారా? దుబాయ్‌లో మాత్రం ఇదే జరుగుతోంది. అక్కడ కొన్ని నంబర్లకు ఉన్న క్రేజ్ చూస్తే లగ్జరీ కార్ల ధరలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. తాజాగా జరిగిన వేలంలో కేవలం 60 ప్రత్యేక నంబర్ ప్లేట్లను అమ్మితే వచ్చిన మొత్తం ఎంతో తెలుసా? ఏకంగా రూ.150 కోట్లకు పైమాటే! అందులో ఒక నంబర్ ప్లేట్ కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.15 కోట్లకు దగ్గరగా బిడ్ వేశాడు.
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన 121వ ప్రత్యేక వాహన నంబర్ ప్లేట్ల వేలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వేలంలో వచ్చిన మొత్తం, అత్యధిక ధర పలికిన నంబర్లు, గతంలో రికార్డు సృష్టించిన ప్లేట్ ధరలు చూస్తే.. అసలు నంబర్ ప్లేట్లకు ఇంత డిమాండ్ ఎందుకనే ప్రశ్న తలెత్తక మానదు.
60 నంబర్ ప్లేట్లు.. రూ.150 కోట్లకు పైగా ఆదాయం!
దుబాయ్‌లో అక్టోబర్ 24న హిల్టన్ దుబాయ్ అల్ హబ్తూర్ సిటీలో ఈ వేలం జరిగింది. అక్టోబర్ 26న వెల్లడించిన ఫలితాల ప్రకారం, మొత్తం 60 ప్రత్యేక నంబర్ ప్లేట్ల అమ్మకం ద్వారా RTAకి 65.721 మిలియన్ దిర్హామ్‌లు వచ్చాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.150 కోట్లకు పైమాటే. డాలర్లలో చెప్పాలంటే దాదాపు 1.79 కోట్ల డాలర్లు.
ఈ వేలంలో AA, BB, CC, H, U, V, W, X, Y, Z సిరీస్‌లకు చెందిన రెండు, మూడు, నాలుగు, ఐదు అంకెల నంబర్ ప్లేట్లను అందుబాటులో ఉంచారు. అయితే అన్ని నంబర్లూ ఒకే ధర పలకలేదు. కొన్ని ప్రత్యేక నంబర్ల కోసం జరిగిన పోటీనే ఈ వేలంలో అసలు హైలైట్‌గా నిలిచింది.
ఒక్క నంబర్ ప్లేట్ ధర రూ.15 కోట్లు!
ఈ వేలంలో CC44 నంబర్ ప్లేట్ అత్యధిక ధర పలికింది. దీనిని కొనుగోలు చేసేందుకు ఒకరు 6.72 మిలియన్ దిర్హామ్‌లు, అంటే సుమారు రూ.15.4 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు.
ఇక రెండో స్థానంలో నిలిచిన BB18 నంబర్ ప్లేట్ 6.62 మిలియన్ దిర్హామ్‌లు, అంటే సుమారు రూ.15.2 కోట్లకు అమ్ముడైంది. మరో నంబర్ ప్లేట్ BB80 కూడా ఏ మాత్రం తగ్గలేదు. దీనికి 5.9 మిలియన్ దిర్హామ్‌లు, భారత కరెన్సీలో సుమారు రూ.13.5 కోట్ల బిడ్ వచ్చింది.
ఇక BB117 నంబర్ ప్లేట్ 1.016 మిలియన్ దిర్హామ్‌లు, అంటే సుమారు రూ.2.3 కోట్లకు అమ్ముడైంది.
ఈ నాలుగు నంబర్ ప్లేట్ల ద్వారానే 20.256 మిలియన్ దిర్హామ్‌లు వచ్చాయి. అంటే వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో దాదాపు 31 శాతం ఈ నాలుగు నంబర్ల నుంచే వచ్చింది. కేవలం నాలుగు ప్లేట్లే ఇంత ఆదాయం తెచ్చిపెట్టాయంటే, దుబాయ్‌లో ప్రత్యేక నంబర్లకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నంబర్ ప్లేట్ కోసం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు?
సాధారణంగా మన దగ్గర వాహన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది గుర్తింపు కోసం ఉపయోగపడే సంఖ్య మాత్రమే. కానీ దుబాయ్‌లో కొన్ని ప్రత్యేక నంబర్లు హోదా, వ్యక్తిగత అభిరుచి, అరుదైన కలెక్షన్‌కు చిహ్నంగా మారాయి.
చిన్న నంబర్లు, సులభంగా గుర్తుండిపోయే అంకెల కలయికలు, ప్రత్యేకంగా కనిపించే నంబర్ల కోసం సంపన్నులు పోటీ పడుతున్నారు. ఖరీదైన కారుకు ప్రత్యేకమైన నంబర్ ఉంటే అది తమ వ్యక్తిత్వాన్ని, స్థాయిని చూపిస్తుందని కొందరు భావిస్తారు. అందుకే సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్‌తో పోలిస్తే అరుదైన నంబర్లకు భారీ ధరలు పలుకుతున్నాయి.
RTA కూడా తన వేలం విధానంలో పారదర్శకత, నిష్పాక్షికత, పాల్గొనే వారందరికీ సమాన అవకాశాలపై దృష్టి పెడుతోంది. ప్రత్యక్షంగా నిర్వహించే వేలాలతో పాటు ఆన్లైన్ వేలాల ద్వారా కూడా ప్రత్యేక నంబర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
గత వేలంలో ఇంకా భారీ ధరలు.. ఈసారి తగ్గిన ఆదాయం!
అయితే తాజా వేలంలో వచ్చిన రూ.150 కోట్లకు పైగా ఆదాయం పెద్ద మొత్తమే అయినప్పటికీ, గత వేలంతో పోలిస్తే ఇది తక్కువే.
2025 డిసెంబర్ 27న జరిగిన దుబాయ్ RTA ప్రత్యేక నంబర్ ప్లేట్ల వేలంలో ఏకంగా 109.026 మిలియన్ దిర్హామ్‌లు వచ్చాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.250 కోట్లకు పైమాటే. అప్పట్లో ఈ మొత్తం RTA నంబర్ ప్లేట్ల వేలం చరిత్రలో రికార్డుగా నిలిచింది.
ఆ వేలంలో BB12 నంబర్ ప్లేట్ 9.66 మిలియన్ దిర్హామ్‌లు, అంటే సుమారు రూ.22 కోట్లకు అమ్ముడైంది. తాజా వేలంలో అత్యధిక ధర పలికిన CC44తో పోలిస్తే BB12 ధర మరింత ఎక్కువ.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








