తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్
* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం
* ఫార్మా, ఏరోస్పేస్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో అపార అవకాశాలు
* తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: తెలంగాణ నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ.. సమష్టి కృషితో దానిని సాధించవచ్చని
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, ఆహార శుద్ధి, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఆశించేది విధానాల్లో స్థిరత్వం, నిబంధనల్లో స్పష్టత, వ్యాపార నిర్వహణలో పారదర్శకతేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
ఇందుకు తెలంగాణ చరిత్రలోని కాకతీయుల కాలం నాటి ఉదాహరణను ప్రస్తావించారు. క్రీ.శ. 1244లో కాకతీయ పాలకుడు గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవులో జారీ చేసిన అభయ శాసనం సముద్ర వాణిజ్యంలో కీలక సంస్కరణలకు నాంది పలికిందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
* తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లు
తెలంగాణ నుంచి ఎగుమతులు పెంచేందుకు రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. రాష్ట్రంలోని అత్యధిక ఎగుమతి సామర్థ్యం ఉన్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించాలన్నారు. తెలంగాణలోని జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఇందుకు నాణ్యమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఉత్పత్తుల మూలాలను గుర్తించే ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
తాండూరు కందిపప్పు, చపాటా మిర్చి, నిజామాబాద్ పసుపు వంటి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మంచి అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాటికి అంతర్జాతీయంగా మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటే రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.ఇటీవల తాండూరు ఎర్ర కందిపప్పు ఉత్పత్తులను హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు.
* ఫార్మా రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం
తెలంగాణ ఫార్మా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గోయల్ సూచించారు. జనరిక్ ఔషధాల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, అధిక విలువ కలిగిన బ్రాండెడ్ ఔషధాలు, వినూత్న ఔషధాలు, బయోసిమిలర్ల తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంతరిక్షం, విమానయాన రంగాలు, విమాన విడిభాగాల తయారీ, నిర్వహణ-మరమ్మతు సేవలు (ఎంఆర్ఓ), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో తెలంగాన పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ సందర్బంగా జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తేనే వివిధ పరిశ్రమల్లో ప్రపంచ స్థాయి నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పారు. దీపావళి పండుగ సమయంలో ఒక్కో దీపం వెలిగించడం ద్వారా వెలుగులు విస్తరించినట్లే.. ఒక్కో పెట్టుబడి, ఒక్కో ఎగుమతి, ఒక్కో కొత్త ఉద్యోగం, ఒక్కో స్టార్టప్ దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. భారత్, తెలంగాణ భవిష్యత్తు ఉమ్మడి కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణలోని అవకాశాలను పరిశీలించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల సృష్టి, ప్రజల సంపద పెరుగుదల, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.








