వీసా మోసాలకు పాల్పడితే ఖబడ్దార్.. స్థానిక ఉద్యోగాలు అమెరికన్లకే అన్న వాన్స్..!
TEXAS:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ .. కంపెనీలకు వార్నింగిచ్చారు. అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అమెరికన్లకే అని స్పష్టం చేశారు. కాదని విదేశీ కార్మికులకు కట్టబెడితే చర్యలు తప్పవని ఘాటు హెచ్చరికలు చేశారు.వీసా మోసాలకు పాల్పడే సంస్థలు, అమెరికా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ కార్మికులను నియమించే కంపెనీల యాజమాన్యాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. టెక్సాస్‌లోని వెదర్ఫోర్డ్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ సార్వభౌమాధికారం అంటే అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడటమేనని వాన్స్ అన్నారు. అమెరికా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీ కార్మికులను నియమించే సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.అమెరికా కార్మికులకు మేలు చేసేలా వాణిజ్య విధానాలను రూపొందిస్తున్నామని వాన్స్ చెప్పారు. దేశంలో కొత్తగా 670 బిలియన్ డాలర్ల తయారీ రంగ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఓడరేవులు, చమురు శుద్ధి కేంద్రాలు, కర్మాగారాల విస్తరణతో స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధిలో టెక్సాస్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
ఇవి కూడా చదవండి
యువత సొంత ఇల్లు కొనుగోలు చేయగలిగేలా చర్యలు తీసుకుంటున్నామని వాన్స్ తెలిపారు. వాల్‌స్ట్రీట్ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు ఇళ్ల కొనుగోళ్లపై చూపే ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. టిప్స్ ద్వారా వచ్చే ఆదాయం, అదనపు పని గంటల వేతనాలు, సీనియర్లకు పన్ను ఉపశమనం కల్పించే చర్యలను ప్రస్తావించారు. చిన్నపిల్లలున్న కుటుంబాలకు ప్రయోజనాలు పెంచడంపైనా మాట్లాడారు.
యువత సొంత ఇళ్లు కొనుక్కొని, కుటుంబాలను ఏర్పరచుకుని, స్థిరమైన ఉద్యోగాలతో జీవించే పరిస్థితులు రావాలని వాన్స్ ఆకాంక్షించారు. తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. మందులు కొనాలా? ఆహారం కొనాలా? అని ఆలోచించాల్సిన పరిస్థితులు తన కుటుంబంలో ఉండేవని చెప్పారు. సామాన్య కుటుంబాల జీవన వ్యయాన్ని తగ్గించడం ప్రభుత్వ బాధ్యతగా అభివర్ణించారు.కెన్ పాక్స్టన్ అమెరికా సెనేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాన్స్ ఈ సభలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, సరిహద్దు భద్రత, ఇంధన ఉత్పత్తి, జీవన వ్యయాల తగ్గింపును ప్రస్తావిస్తూ రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతివ్వాలని ఓటర్లను కోరారు.








