KTR: బాబు భేష్.. రేవంత్ వేస్ట్ : కేటీఆర్!
తెలంగాణ రాజకీయాల్లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు ఓ సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారాయి. రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరత, కరవు ఛాయలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే రైతులు అల్లాడిపోతున్నారని ఆరోపిస్తూ, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆయనో ప్రధాన రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఏపీలో పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయని, అక్కడ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పడం ద్వారా తెలంగాణ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేసే వ్యూహానికి బీఆర్ఎస్ తెరలేపింది.
అయితే.. కేటీఆర్ చేస్తున్న ఈ ప్రచారంలో వాస్తవాల కంటే రాజకీయ రంగులే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నది క్షేత్రస్థాయి పరిశీలకుల మాట. ఎల్‌నినో విపత్తు ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనది కాదనేది కఠోర సత్యం. వాతావరణ మార్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఒకేలా పడింది. ఏపీలోనూ వర్షాభావం తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది. ఖరీఫ్ సీజన్లో భారీ లోటు వర్షపాతం నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం ఏకంగా 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించక తప్పలేదు. ముఖ్యంగా రాయలసీమలో లక్షలాది ఎకరాల్లో వేరుశనగ, పత్తి, వరి పంటలు ఎండిపోయాయి. బోరుబావులు సైతం నిరుపయోగంగా మారడంతో రైతులు ట్యాంకర్ల నీటిపై ఆధారపడే దుర్భర పరిస్థితి ఏర్పడింది.
మరి ఇరు రాష్ట్రాల మధ్య ప్రధాన తేడా ఏమిటంటే.. ఏపీలో రాజకీయ రచ్చ తక్కువగా ఉండటం, అక్కడి ప్రభుత్వం కంటింజెన్సీ ప్రణాళికలతో నెట్టుకురావడమే. హంద్రీ-నీవా, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోయినప్పటికీ, ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ, తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పెద్దగా దుమారం రేగలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేలా ఉంది.
ఇక కేటీఆర్ వ్యూహం పూర్తిగా రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే పరిమితమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష కట్టి, సాంకేతిక కారణాలు చెప్పి నీటిని తోడకపోవడం వల్లే ఈ కరవు వచ్చిందని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తోంది. పొరుగు రాష్ట్రం కరవును అద్భుతంగా మేనేజ్ చేస్తోందని, ఇక్కడ మాత్రం ప్రభుత్వం ప్రకృతి విపత్తు అంటూ చేతులెత్తేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఎల్‌నినో సృష్టించిన కరవు కష్టాలు రెండు రాష్ట్రాల రైతాంగాన్ని సమానంగా దెబ్బతీశాయి. ఏపీలోని లోపాలను కప్పిపుచ్చి, కేవలం రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆంధ్రాను మోడల్‌గా చూపడం కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్ప, అన్నదాతల కన్నీళ్లు మాత్రం ఇరువైపులా ఒకేలా ఉన్నాయి.








