కూటమి ధర్మం ఉల్లంఘిస్తే వేటే.. రెబల్స్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కూటమిలో రెబల్స్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో టీడీపీ(TDP ) నేతలు స్వతంత్రంగా బరిలోకి దిగడం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆగ్రహానికి కారణమైంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ నాయకులు పోటీ చేస్తుండటంపై జనసేన (Janasena) నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్వయంగా రెబల్ అభ్యర్థుల వ్యవహారాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కూటమి నాయకత్వం నిర్ణయించిన అభ్యర్థులకు అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. పొత్తులో భాగంగా ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో మరో పార్టీ నాయకులు పోటీ చేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు ఇతర మంత్రులను పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఇంకా ఎక్కడైనా రెబల్ అభ్యర్థులు కొనసాగుతున్నారా అని ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు, జిల్లాల నుంచి అందిన సమాచారాన్ని కొందరు మంత్రులు ఆయనకు వివరించారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమి నిర్ణయాలను ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ కొందరు నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా ఎవరికి వారే అభ్యర్థులుగా కొనసాగితే ఎలా అని నిలదీశారు.
టీడీపీ అభ్యర్థులు ఎవరికి పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయకూడదనే విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని చంద్రబాబు తేల్చిచెప్పారు. జనసేన, బీజేపీకి (BJP ) కేటాయించిన స్థానాల్లో టీడీపీ నాయకులు బరిలో ఉండకూడదని స్పష్టం చేశారు. కూటమి తరఫున అధికారికంగా ఖరారు చేసిన అభ్యర్థుల విజయానికి మిగిలిన నాయకులంతా సహకరించాలని ఆదేశించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీలో కొనసాగేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్చార్జి మంత్రులే తీసుకోవాలని సీఎం సూచించారు. రెబల్స్‌ను బుజ్జగించడం, అధికారిక అభ్యర్థులకు మద్దతు కూడగట్టడం వంటి అంశాల్లో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత అసంతృప్తులు, పదవులపై చర్చల కంటే కూటమి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఒకవైపు ఆర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు స్థానిక ఎన్నికలపై పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. కూటమి అధికారంలోకి రావడానికి మూడు పార్టీల ఐక్యతే ప్రధాన బలమని, ఎన్నికల సమయంలో అదే ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. రెబల్ అభ్యర్థులపై తీసుకునే చర్యలు కూటమిలో క్రమశిక్షణను ఎంతవరకు నిలబెడతాయో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








