అర్నబ్ తుఫాన్ నష్టంపై వైఎస్ షర్మిల ఆవేదన..!
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగం తీవ్ర ఆత్మఘోష అనుభవిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వేదికగా శుక్రవారం నాడు ఆమె ఒక అధికారిక ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో తుఫాను పాలై రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే గుండె తరుక్కుపోతోందని, అర్నబ్ తుఫాను అన్నదాతల ఆశలను మట్టిలో కలిపేసిందని ఆమె పేర్కొన్నారు.
తుఫాన్ ధాటికి క్షేత్రస్థాయిలో జరిగింది కొండంత నష్టమైతే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాగితాల మీద గోరంత మాత్రమే చూపెడుతోందని షర్మిల విమర్శించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో అన్ని పంటలు కలుపుకుంటే ప్రాథమికంగా జరిగిన నష్టం 15 లక్షల ఎకరాలకు పైనే ఉందని, ఇందులో వరి పంటకు జరిగిన నష్టమే అత్యధికంగా 10 లక్షల ఎకరాలు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. 100 శాతం పంటలు నష్టపోయిన రైతుల సంఖ్య సుమారు 7 లక్షల పైమాటేనని, రోడ్లు, ఇతర మౌలిక రంగాలు అన్ని కలుపుకొని దాదాపు రూ. 15,000 కోట్ల నష్టం వాటిల్లితే, ప్రభుత్వం కేవలం రూ. 4,600 కోట్ల నష్ట అంచనా చూపించడం మోసపూరితమని మండిపడ్డారు.
ఆర్భాటంలో అగ్రస్థానం, రైతులను ఆదుకోవడంలో చివరిస్థానం అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఉందని షర్మిల ధ్వజమెత్తారు. కేంద్ర బృందాల పర్యటనలు, నష్టనివారణ చర్యలంటూ హడావిడి చేయడం తప్ప ఆచరణ శూన్యమని, గతంలో వచ్చిన ‘మొంథా’ తుఫాన్ నష్టపరిహారాన్ని కూడా ఇంతవరకు ఇవ్వలేదంటే కూటమి ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో బాధిత రైతాంగం తరఫున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వం ముందు 10 డిమాండ్లను ఉంచారు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్లలో ముఖ్యంగా నీటమునిగిన వరి, ఇతర పంటలకు ఎకరాకి రూ. 30 వేలు, ఉద్యానవన మరియు ఆక్వా రైతులకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి రక్షణ కల్పించడంతో పాటు, తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర (MSP) కే కల్లాల వద్దే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు వ్యవసాయ రుణాల మాఫీ, రబీ సీజన్ కి ఉచితంగా ఎరువులు, విత్తనాల పంపిణీ, కొత్త రుణాలకు వడ్డీ మాఫీ భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల నష్టంపై అంచనా వేసి పరిహారం ఇవ్వాలని, రాష్ట్రం దగ్గర నిధులు లేకుంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని(Narendra Modi) ఒప్పించి కేంద్రం నుంచి నిధులు తేవాలని సూచించారు. వెయ్యి, మూడు వేల రూపాయల నామమాత్రపు పరిహారాలు ఇస్తే ఊరుకోబోమని, పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని షర్మిల హెచ్చరించారు.








