విశాఖ డిప్యూటీ మేయర్ పీఠంపై బీజేపీ కన్ను.. తగ్గేదేలేదంటున్న జనసేన..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం (Visakhapatnam)కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడి రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అద్భుతమైన ఫలితాలు సాధించడంతో ఇప్పుడు పదవుల పంపకాలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్నది మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.
విశాఖలో తెలుగుదేశం పార్టీకి (TDP) మొదటి నుంచి బలమైన పట్టు ఉంది. భారతీయ జనతా పార్టీకి కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉండగా, జనసేనకు సామాజిక సమీకరణల పరంగా ఓటు బ్యాంకు ఉంది. ఈ మూడు పార్టీల బలాలు కలవడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 120 వార్డులకు గాను 98 స్థానాలను అధికారిక కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించినప్పటికీ, వారు కూటమికి చెందిన రెబల్స్ కావడం గమనార్హం. దీంతో కూటమి వైపు మొత్తం 106 మంది కార్పొరేటర్ల మద్దతు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ 13 స్థానాలతో ప్రతిపక్షంలో ఉండనుండగా, సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి
మేయర్ పదవి టీడీపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు డిప్యూటీ మేయర్ స్థానంపై బీజేపీ, జనసేన (Janasena) మధ్య పోటీ నెలకొంది. విశాఖలో తమకున్న రాజకీయ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మేయర్ పదవిని ఇవ్వాలని బీజేపీ (BJP ) గతంలోనే కోరినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానం కూడా కేటాయించకపోవడంతో కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా ఇవ్వాలని టీడీపీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే విశాఖ బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు కార్పొరేటర్‌గా పోటీ చేశారని, ఆయనకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆయన పేరు ఈ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) కూడా ఈ పదవి తమ పార్టీకి దక్కేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు జనసేన కూడా డిప్యూటీ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకుంది. విశాఖలో 26 మంది కార్పొరేటర్లతో కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకు ఈ అవకాశం ఇవ్వడం సమంజసమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేవలం ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్న బీజేపీకి కాకుండా, తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఇచ్చిన రాజకీయ హామీలను పరిగణనలోకి తీసుకుంటే తమకే అవకాశం వస్తుందని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.
ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు కూడా ఈ పదవుల పంపకంలో కీలకంగా మారే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం కార్పొరేషన్లలో టీడీపీకి ప్రాధాన్యత దక్కగా, రాబోయే శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనకు అవకాశం కల్పించే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే విజయనగరంలో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో విశాఖ మేయర్ పదవిని బీజేపీ గెలుచుకున్న చరిత్ర కూడా ఆ పార్టీ నేతలకు గుర్తుంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ స్థానం దక్కితే నగర రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అయితే జనసేన కూడా తన బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదని పట్టుబడుతోంది. దీంతో చివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ డిప్యూటీ మేయర్ పీఠం బీజేపీకి దక్కుతుందా? లేక జనసేన తన బలంతో ఆ స్థానాన్ని సాధించుకుంటుందా? అన్నది త్వరలో తేలనుంది.







