అమెరికా చిప్ పాలిటిక్స్.. భారత్ తో చేతులు కలిపి చైనాకు చెక్..!
ఎన్విడియా గూఢచర్య ఘటన ఆరోపణలతో అమెరికా అప్రమత్తమైంది.చైనా (China) చేతికి అత్యాధునిక శక్తిమంతమైన కంప్యూటర్ చిప్స్ అందకుండా ఓ బలమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దీనిలో భారత్ (India) కూడా కీలక భాగస్వామిగా మారింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ను ఓ మహిళతో హనీట్రాప్ చేసి లక్షల కొద్దీ అత్యాధునిక చిప్స్‌ను చైనాకు తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితులను కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం ఈ చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే ‘శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ ది సెక్యూర్ ఫౌండేషన్ ఆఫ్ ఎండ్యూరింగ్ ప్రాస్పరిటీ’ (San Francisco Declaration)పై భారత్ సంతకం చేసింది. దీనిలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యూకే, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. వచ్చే వారంలో జర్మనీ, యూరప్ సమాఖ్య, నెదర్లాండ్స్, స్వీడన్ కూడా ఇందులో చేరనున్నాయి.
ఇవి కూడా చదవండి
పాక్స్ సిలికాలో కీలక ముందడుగు..
ఇప్పటికే ఏఐ పంపిణీ వ్యవస్థలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి అమెరికా చేపట్టిన పాక్స్ సిలికా ఒప్పందంలో భారత్ కూడా సంతకం చేసింది. సెమీకండెక్టర్లు, క్రిటికల్ మినరల్స్, అత్యాధునిక తయారీ విధానాలు, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల వంటివి దీని పరిధిలోకి వస్తాయి. వాస్తవానికి కంప్యూటర్ చిప్స్ డిజైన్ ఓ దేశంలో, తయారీ మరో దేశంలో, సరఫరా ఇంకో దేశం నుంచి జరుగుతుండటంతో వీటిపై నియంత్రణ కష్టమైపోయింది. అందుకే అమెరికా ఈ ఒప్పందం చేసుకొంది.
భారత్ ఇప్పుడీ చిప్స్ తయారీపై దృష్టి పెట్టింది. తాజా ఒప్పందంతో ప్రపంచ పంపిణీ వ్యవస్థలో మన దేశం కీలక పాత్ర పోషించనుంది. దేశీయ కంపెనీలు నమ్మకమైన సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది.







