హైదరాబాద్‌కు ముంచుకొస్తున్న నీటి ముప్పు!
ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు మన హైదరాబాద్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. తాగునీటి కొరత నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేయబోతోంది. ఈ ప్రభావం కేవలం సాధారణ ప్రజలకే పరిమితం కాకుండా విద్యా సంస్థలు, ఉపాధి రంగాన్ని కూడా కుదిపేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది.
నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి అత్యంత దారుణంగా మారింది. ఎక్కడ చూసినా నీటి ట్యాంకర్ల శబ్దాలే వినిపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో మున్సిపల్ నీటి సరఫరాపై భారం పడింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని అనేక ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు కూడా నీరు దొరకని దుస్థితి నెలకొంది. డిసెంబరులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరింత ఉధృత రూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నీటి కొరత కారణంగా హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హాస్టళ్ల నిర్వహణ భారంగా మారడంతో పాటు విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తడంతో కొన్ని విద్యా సంస్థలు అనివార్యంగా తాత్కాలిక సెలవులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై తీవ్ర కసరత్తు చేస్తోంది. డిసెంబరులో ఎండల తీవ్రత, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఎండ ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని, జూనియర్ కాలేజీల వేళల్లో మార్పులు చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ఉన్నత విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చేపట్టాలని ఆలోచిస్తోంది.
హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ఐటీ రంగంపై కూడా ఈ నీటి సంక్షోభం తీవ్రంగానే ఉండనుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ట్యాంకర్ల నీటిపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. కంపెనీలలో నీటి వినియోగం, విద్యుత్ వాడకం భారీగా పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయడం ద్వారా నగరంలో నీటి వినియోగం, విద్యుత్ ఆదా అవుతాయని భావిస్తున్నారు. ఈ విధానం అమలైతే సంక్రాంతి సమయానికి దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులు తమ సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉందని, దీనివల్ల హైదరాబాద్‌పై తాత్కాలికంగా జనాభా భారం, వనరుల వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
ఎల్‌నినో సృష్టిస్తున్న ఈ పర్యావరణ మార్పులు కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే కాదని, భవిష్యత్తులో నగర ప్రణాళికను పునఃసమీక్షించుకోవాల్సిన హెచ్చరిక అని చెప్పవచ్చు. తాగునీటి సంక్షోభం నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, వాటర్ రీసైక్లింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.







