ట్రంప్ వలస విధానాలపై ప్రశ్నల వర్షం.. అమెరికా గవర్నర్‌ను ఇరుకున పెట్టిన టీవీ చర్చ!
అమెరికాకు విదేశీయులు కావాలి.. అక్కడి కంపెనీల్లో పనిచేయడానికి, ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి వలసదారుల సేవలు అవసరం. కానీ అదే విదేశీయులు అమెరికాలోకి రావాలంటే మాత్రం కఠిన ఆంక్షలు! ఇదే ఇప్పుడు ట్రంప్ వలస విధానాల చుట్టూ నడుస్తున్న అసలు చర్చ. అమెరికాలో విదేశీయుల అవసరం ఒకవైపు, వారిపై ఆంక్షలు విధించాలనే రాజకీయ వైఖరి మరోవైపు.. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఓ టీవీ షోలో ప్రశ్నించారు. ట్రంప్ మాజీ ప్రెస్ సెక్రటరీ, ఆర్కాన్సాస్ గవర్నర్ సారా హుకబీ శాండర్స్‌కు ఈ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రంప్ విధానాలను సమర్థించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంటే.. హోస్ట్స్ మాత్రం ఒక్కో ప్రశ్నతో ఆమెను ఇరుకున పెట్టారు. చివరకు ప్రేక్షకుల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైంది. అసలేం అడిగారు..ఆమె ఏం చెప్పారో చూద్దా.
ట్రంప్ విధానాలను సమర్థించుకోవడం అంత ఈజీ కాలేదు!
సారా హుకబీ శాండర్స్ పేరు అమెరికా రాజకీయాలను గమనించే వారికి కొత్త కాదు. ట్రంప్ తొలి ప్రభుత్వంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం ఆర్కాన్సాస్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. ట్రంప్‌కు, ఆయన MAGA రాజకీయాలకు మద్దతుగా నిలిచే నేతల్లో ఆమె కూడా ఒకరు. తన కొత్త పుస్తకం Unapologetic: Clarity and Conviction in a World Gone Crazy ప్రచారం కోసం ప్రముఖ టీవీ షో ‘ది వ్యూ’కు వెళ్లిన ఆమెకు అక్కడ ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి.
మొదట్లో ఇంటర్వ్యూ సాధారణంగానే సాగినా.. అమెరికా వలస విధానాల ప్రస్తావన రావడంతో అసలు కథ మొదలైంది. ఆర్కాన్సాస్‌లో పనిచేస్తున్న వారిలో దాదాపు 10 శాతం మంది విదేశాల్లో జన్మించినవారే. అంటే ఆ రాష్ట్రంలో విదేశీయులు కూడా ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. అలాంటప్పుడు ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై ఇంత కఠినంగా వ్యవహరించడాన్ని ఎలా సమర్థిస్తారని హోస్ట్ అనా నవారో ప్రశ్నించారు. అంతేకాదు, వలసల విషయంలో కఠిన వైఖరికి పేరున్న స్టీఫెన్ మిల్లర్‌కు ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వడంపైనా వివరణ కోరారు.
దీనికి సారా చెప్పిన సమాధానం ఊహించినట్లుగానే ట్రంప్ నిర్ణయాలకు మద్దతుగానే సాగింది. అమెరికా సరిహద్దులను భద్రపరచడం చాలా అవసరమని, ముఖ్యంగా హింసాత్మక నేరాలకు పాల్పడిన అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ట్రంప్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఆమె సమర్థించారు. అయితే అనా నవారోకు ఈ సమాధానం సరిపోలేదు. అమెరికాలో ఉన్న వలసదారుల్లో అత్యధికులకు ఎలాంటి హింసాత్మక నేర చరిత్ర లేదని గుర్తుచేశారు. దీంతో స్టూడియోలోని ప్రేక్షకుల నుంచి చప్పట్లు వినిపించాయి.
సారా కూడా అంతే గట్టిగా స్పందించారు. తాను చెప్పిన మాటలను వక్రీకరించవద్దని, హింసాత్మక నేరాలకు పాల్పడిన వారిపైనే చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని తాను చెబుతున్నానని స్పష్టం చేశారు. కానీ నవారో మరో ప్రశ్నతో ఆమెను ఇరుకున పెట్టారు. ట్రంప్ నిజంగానే అలాంటి నేరస్థులపై మాత్రమే దృష్టి పెట్టారా? అని అడిగారు. దీంతో సారా మళ్లీ సరిహద్దుల భద్రత గురించే మాట్లాడాల్సి వచ్చింది. అసలు చర్చ మాత్రం అక్కడితో ముగియలేదు.
మనుషులను ‘అక్రమం’ అని ఎలా పిలుస్తారు?
వలసదారుల గురించి మాట్లాడుతున్నప్పుడు మరో హోస్ట్ సన్నీ హోస్టిన్ కూడా జోక్యం చేసుకున్నారు. విదేశీయులను ‘Illegal People’ అని పిలవడం సరైన పద్ధతి కాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి వద్ద సరైన వలస పత్రాలు లేనప్పుడు ‘Undocumented People’ అంటే పత్రాలు లేని వ్యక్తులుగా పేర్కొనాలని సూచించారు.
దీనికి సారా కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిని అక్రమంగా ఉన్నవారిగా పరిగణించడంలో తప్పేముందని ప్రశ్నించారు. అయితే హోస్టిన్ మాత్రం అసలు విషయాన్ని వేరే కోణంలో వివరించే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడి ఉండవచ్చు, చట్టాన్ని ఉల్లంఘించి ఉండవచ్చు. కానీ అందువల్ల ఆ వ్యక్తినే అక్రమం అని పిలవడం సరికాదన్నది ఆమె వాదన. దీనికి సారా అది వాస్తవపరంగా తప్పని చెప్పగా, హోస్టిన్ కూడా ఆమె మాటలను అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రేక్షకుల నుంచి కూడా సారాకు పెద్దగా మద్దతు లభించలేదు.
పీట్ హెగ్సెత్ గురించి అడిగినా.. సూటిగా సమాధానం రాలేదు!
వలస విధానాల దగ్గరే ఆగిపోకుండా హోస్ట్స్ మరో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పనితీరు ఎలా ఉందని సారాను అడిగారు. ఆయన తన బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అన్నది ప్రశ్న. అయితే దీనికి వెంటనే అవును, కాదు అని చెప్పకుండా.. హెగ్సెత్ బాధ్యతలు చాలా కష్టమైనవని ఆమె వివరించారు. చివరకు తాను వ్యక్తిగతంగా చూసిన విషయాల ఆధారంగా ఆయన మంచి పని చేస్తున్నారని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమాధానం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. సారా మాత్రం హెగ్సెత్ గతంలో సైన్యంలో పనిచేశారని, దేశ రక్షణ కోసం యూనిఫాం ధరించి పోరాడారని గుర్తుచేశారు. సైనికులకు సేవ, త్యాగం అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసని సమర్థించుకున్నారు. అయినప్పటికీ ఆమె సమాధానానికి స్టూడియోలో పెద్దగా సానుకూల స్పందన కనిపించలేదు.
పుస్తక ప్రచారానికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్న సారా!
ఈ ఇంటర్వ్యూ జరగడానికి ముందు నుంచే సారా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన కొత్త పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఉన్నట్లుగా కనిపించే ఓ ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. అయితే ఆ చిత్రం AI ద్వారా రూపొందించిందనే ఆరోపణలు రావడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇప్పుడు టీవీ షోలోనూ ట్రంప్ వలస విధానాలపై వరుస ప్రశ్నలు ఎదురవడంతో ఆమె ఇంటర్వ్యూ మరోసారి చర్చనీయాంశమైంది.
ఎన్నారైలు గమనించాల్సిన అసలు విషయం ఇదే!
ఈ మొత్తం చర్చలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికా వలస విధానాలు ఇప్పుడు కేవలం రాజకీయ పార్టీల మధ్య జరిగే వాదనగా మాత్రమే మిగలడం లేదు. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల అవసరం, వారి హక్కులు, దేశ భద్రత, వలస చట్టాల అమలు.. ఇలా అనేక అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, H-1B వీసాదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న ఎన్నారైలకు ఈ చర్చలు సహజంగానే ఆసక్తి కలిగిస్తాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







