బీజేపీ గూటిలో ఆధిపత్య కుంపటి!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్ఠానానికి నేతల వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని ఢిల్లీ పెద్దలు పదేపదే దిశానిర్దేశం చేస్తున్నా.., రాష్ట్ర నాయకత్వంలో మాత్రం సఖ్యత కనిపించడం లేదు. ముఖ్యంగా 2026 జనవరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థాగత క్రమశిక్షణపై అధిష్ఠానం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అయినా కూడా తెలంగాణ నేతల తీరులో మార్పు రాకపోవడం, ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ వరకు అగ్రనేతలంతా తెలంగాణ నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి జాతీయ నేతలు వచ్చినప్పుడల్లా సమీక్షల పేరిట క్లాసులు తీసుకోవడం, ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలకు అధిష్ఠానం మొట్టికాయలు వేయడం పరిపాటిగా మారింది. సమిష్టి నాయకత్వం కొరవడటంతోనే జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పదవులు ఆపితేనైనా నేతల్లో మార్పు వస్తుందని ఢిల్లీ పెద్దలు భావించినా, ఇక్కడి నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం కిందిస్థాయి కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో ర్యాలీలు, మహా పాదయాత్రలు నిర్వహించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ పాదయాత్ర నిర్వహించగా, నిర్మల్లోనూ సభ జరిగింది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి, దానికి జాతీయ స్థాయి నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఎంపీలు లేని నియోజకవర్గాల్లో రాష్ట్ర నాయకత్వమే చొరవ తీసుకుని ఢిల్లీ నేతల సమయాన్ని కోరుతోంది.
అయితే, సొంత ఎంపీలు ఉన్న చోటే అసలైన రాజకీయ రసవత్తర పోరు మొదలైంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక ఎంపీలు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను తమ నియోజకవర్గాలకు రప్పించేందుకు పోటీ పడుతుండటం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే నితిన్ నబీన్‌ను కలిసి, నవంబర్ 18న కరీంనగర్లో లక్ష మందితో నిర్వహించతలపెట్టిన మహా పాదయాత్రకు హాజరుకావాలని ఆహ్వానించారు. పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు వస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.
మరోవైపు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం తమ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్రకు నితిన్ నబీన్ హాజరవుతారని ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. తన విజ్ఞప్తికి జాతీయ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారని అర్వింద్ పేర్కొనడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఒకే రోజు రెండు జిల్లాల్లో భారీ పాదయాత్రలలో పాల్గొనడం జాతీయ అధ్యక్షుడికి సాధ్యమేనా? ఒకవేళ వేర్వేరు తేదీల్లో నిర్వహించాలంటే, అతి తక్కువ వ్యవధిలో రెండుసార్లు తెలంగాణ పర్యటనకు ఆయన సమయం కేటాయిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మొత్తానికి.. ప్రత్యర్థి పార్టీలపై పోరాడాల్సిన సమయంలో బీజేపీ నేతలు తమలో తాము ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. నితిన్ నబీన్ పర్యటన షెడ్యూల్ ఖరారైతే తప్ప ఈ ఇద్దరు ఎంపీల పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో తేలదు. కానీ, ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీలో సమన్వయ లోపాన్ని మరోసారి బహిర్గతం చేశాయి.







