విత్తనాలు అవసరం లేదు.. కొమ్మలతోనే పెంచుకోగల ఇండోర్ మొక్కలు
ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే ఆ వాతావరణమే ప్రత్యేకంగా ఉంటుంది. రోజంతా పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు పచ్చని ఆకులను చూస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ కొంత సమయం గడపడం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఇంట్లో మొక్కలు పెంచుకోవాలంటే ప్రతిసారీ విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న మొక్కల కొమ్మలతోనే మరికొన్ని కొత్త మొక్కలను పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పెంచుకోగల కొన్ని అందమైన ఇండోర్ మొక్కల గురించి తెలుసుకుందాం.
కొమ్మలతో సులభంగా పెంచుకోగల 6 ఇండోర్ మొక్కలు..

మనీ ప్లాంట్: ఇంట్లో పెంచుకోవడానికి సులువైన మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. దీని ఆరోగ్యకరమైన తీగ నుంచి కనీసం ఒకటి లేదా రెండు కణుపులు (Nodes) ఉండేలా కొమ్మను కత్తిరించాలి. కింది ఆకులను తొలగించి నీళ్ల గ్లాసులో ఉంచితే క్రమంగా వేర్లు వస్తాయి. తర్వాత చిన్న కుండీలో నాటుకోవచ్చు. పరోక్ష వెలుతురు అందే చోట ఉంచితే బాగా పెరుగుతుంది.
ఫిలోడెండ్రాన్ : గుండె ఆకారంలో ఉండే ఆకులతో కనిపించే ఈ మొక్క ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది. ఆరోగ్యంగా ఉన్న కొమ్మను కణుపు కింద కత్తిరించి నీటిలో ఉంచాలి. వేర్లు వచ్చిన తర్వాత మట్టిలో నాటుకోవచ్చు. కిటికీ దగ్గర నేరుగా ఎండ తగలని ప్రదేశం దీనికి అనుకూలంగా ఉంటుంది.
ట్రేడ్స్కాంటియా : ఆకర్షణీయమైన రంగుల ఆకులతో కనిపించే ఈ మొక్కను కొమ్మల ద్వారా సులభంగా పెంచుకోవచ్చు. కొమ్మను కత్తిరించి నేరుగా తేమగా ఉండే మట్టిలో నాటాలి. లేదంటే ముందుగా నీటిలో వేర్లు వచ్చేలా చేసి కుండీలోకి మార్చుకోవచ్చు. సరైన వెలుతురు అందితే ఆకులు మరింత అందంగా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి
కోలియస్: ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల కలయికతో కనిపించే కోలియస్ మొక్క ఇంటి అలంకరణకు బాగుంటుంది. దీని కొమ్మను కత్తిరించి కింది ఆకులు తొలగించి నీటిలో ఉంచాలి. వేర్లు వచ్చిన తర్వాత మట్టిలో నాటుకోవచ్చు. మట్టి పూర్తిగా ఎండిపోకుండా చూసుకోవాలి.
సింగోనియం: బాణం ఆకారంలో ఉండే ఆకులతో కనిపించే సింగోనియం కూడా ఇండోర్ గార్డెన్‌కు మంచి ఎంపిక. కణుపు ఉన్న కొమ్మను కత్తిరించి నీటిలో లేదా తేమగా ఉండే మట్టిలో నాటుకోవచ్చు. ప్రకాశవంతమైన పరోక్ష వెలుతురు, తగినంత నీరు అందిస్తే చక్కగా పెరుగుతుంది.
జెడ్ జెడ్ ప్లాంట్ : ఎక్కువ నిర్వహణ అవసరం లేని ఇండోర్ మొక్కల్లో జెడ్ జెడ్ ప్లాంట్ కూడా ఒకటి. దీని ఆకులను చిన్న కాండం భాగంతో కత్తిరించి తేమగా ఉండే మట్టిలో నాటుకోవచ్చు. కొత్త వేర్లు, దుంపలు ఏర్పడటానికి కొన్ని నెలలు పట్టవచ్చు.
మొక్కలు పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
కొమ్మలను కత్తిరించడానికి శుభ్రమైన కత్తెర ఉపయోగించాలి. వేర్లు వచ్చే వరకు మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. అయితే కుండీలో నీరు నిల్వ ఉండకూడదు. నేరుగా ఎండ తగలకుండా వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. మొక్కను గమనిస్తూ అవసరమైనప్పుడు నీటిని మార్చాలి. ఇలా రోజులో కొంత సమయం మొక్కల సంరక్షణకు కేటాయిస్తే ఇంటికి పచ్చదనంతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే చిన్న గార్డెన్‌ను తయారు చేసుకోవచ్చు.







