టీడీపీలో సర్పంచ్ సెగ.. కార్యకర్తలకు షాకిస్తున్న మంత్రుల ఫ్యామిలీ పాలిటిక్స్..
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఈ నెల 29 నుంచి విడతలవారీగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat Elections) అధికార తెలుగుదేశం పార్టీలో (TDP) కొత్త రాజకీయ చర్చకు తెరలేపుతున్నాయి. గ్రామస్థాయిలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అధిష్ఠానం ఆలోచనకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎంపికలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా కొందరు మంత్రులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకే సర్పంచ్ పదవులు దక్కేలా ప్రయత్నిస్తుండటం పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులపై అభ్యర్థులు పోటీ చేయకపోయినా, ఆయా పార్టీల మద్దతు మాత్రం కీలకంగా ఉంటుంది. అందుకే గ్రామాల్లో పార్టీ జెండాను మోసినవారు, కష్టకాలంలో నాయకత్వానికి అండగా నిలిచినవారికి ఈ ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలని టీడీపీ భావించింది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టయి జైలులో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక పార్టీ నాయకుల అభిప్రాయాల కంటే మంత్రుల నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలు పదవులపై ఆశలు పెట్టుకోగా, చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఈ ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లె (Banaganapalle) మేజర్ గ్రామ పంచాయతీ ఉదాహరణగా నిలుస్తోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (B. C. Janardhan Reddy) సతీమణి ఇందిర సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి కుటుంబం నుంచి అభ్యర్థి బరిలోకి దిగడంతో పార్టీ కోసం పనిచేసిన స్థానిక నాయకులకు అవకాశం దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడం ఈ వ్యవహారం ప్రాధాన్యాన్ని పెంచింది.
ఇదే తరహా పరిస్థితులు విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం (Srikakulam), అనంతపురం (Anantapur) జిల్లాల్లోనూ కనిపిస్తున్నట్లు సమాచారం. అక్కడ కూడా కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు వేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. గ్రామస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన ఎన్నికలు, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి సర్పంచ్ పదవులు ప్రస్తుతం గతంలో ఉన్నంత ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యం కలిగి లేవనే వాదన ఉంది. అయినప్పటికీ గ్రామాల్లో రాజకీయ గుర్తింపు, స్థానికంగా పట్టు సాధించడానికి ఈ పదవులు కీలకంగా మారుతున్నాయి. అందుకే కార్యకర్తలు వీటిని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అలాంటి సమయంలో కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగితే పార్టీ కేడర్లో నిరుత్సాహం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రుల నిర్ణయాలను వ్యతిరేకిస్తే ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండగా, కార్యకర్తల అసంతృప్తిని పట్టించుకోకపోతే పార్టీ పునాదులే బలహీనపడే ప్రమాదం ఉంది. దీంతో అధినేతకు ఇరువైపులా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికైనా అభ్యర్థుల ఎంపికలో స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారా? లేక మంత్రుల నిర్ణయాలకే పెద్దపీట వేస్తారా? అన్నది చూడాలి. ఈ ఎన్నికల ఫలితాల కంటే ముందే టీడీపీలో మొదలైన ఈ అంతర్గత అసంతృప్తి పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.







