స్టార్ వారసులకు చేదు అనుభవాన్ని మిగిల్చిన అక్టోబర్
గాంధీ జయంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్(Dont trouble the trouble), సిగ్మా(Sigma)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి(rajamouli) కొడుకు ఎస్ఎస్ కార్తికేయ(SS Karthikeya) నిర్మాతగా పూర్తి స్థాయిలో అడుగుపెట్టడంతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఫహాద్ ఫాజిల్(fahad fassil) ప్రధాన పాత్రలో నటించడంతో పాటు మహేష్ బాబు(mahesh babu), ఎన్టీఆర్(NTR) వంటి స్టార్స్ ప్రమోషన్స్‌లో భాగం కావడం సినిమాకు ఎక్స్ట్రా క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఇవేవీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ట్రైలర్ దశలోనే అంచనాలు తగ్గిపోగా, రిలీజ్ తర్వాత టాక్ మరింత దెబ్బతీసింది.
ఆడియన్స్ రెస్పాన్స్ వీక్ గా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు నుంచే షోలు రద్దయ్యే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వీకెండ్లో కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో పికప్ రాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమాలు సైతం మెరుగైన ఆక్యుపెన్సీ సాధించిన సమయంలో ఈ సినిమాకు థియేటర్లలో నిలబడే అవకాశం తగ్గిపోయింది. డిజిటల్ రైట్స్ ద్వారా కొంతమేర రికవరీ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ, నిర్మాతగా కార్తికేయ తొలి ప్రయత్నానికి వచ్చిన రిజల్ట్ మాత్రం నిరాశ కలిగించేలా మారింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ఎంతవరకు భాగస్వామ్యం వహించారన్న డిస్కషన్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు తమిళ స్టార్ విజయ్(vijay) కొడుకు జాసన్ సంజయ్(Jason sanjay) డైరెక్టర్ గా పరిచయమైన సిగ్మా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. సందీప్ కిషన్(Sundeep kishan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. కానీ రెండు భాషల్లోనూ మౌత్ టాక్ సినిమాకు బలంగా నిలవలేదు. ముఖ్యంగా కథ, ట్రీట్మెంట్ విషయంలో కొత్తదనం కనిపించలేదన్న అభిప్రాయం ఆడియన్స్ లోనూ వినిపించింది. దీంతో గాంధీ జయంతి వీకెండ్ ఇద్దరు స్టార్ వారసుల డెబ్యూ ప్రాజెక్టులకు ఆశించిన స్థాయి ఆదరణ అందించలేకపోయింది. వారసత్వం, స్టార్ సపోర్ట్ కంటే కంటెంట్‌నే ఆడియన్స్ కీలకంగా చూస్తారనే విషయాన్ని ఈ రెండు సినిమాల ఫలితాలు మరోసారి చర్చలోకి తెచ్చాయి.








