భన్సాలీ- ఆలియా కాంబినేషన్ లో మరో సినిమా?
సంజయ్ లీలా భన్సాలీ(Sanjay leela bhansali), ఆలియా భట్(Alia bhatt) కాంబినేషన్‌కు బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. గంగూబాయి కాఠియావాడి(Gangubhai katiawadi)తో ఈ కాంబో మంచి సక్సెస్‌ను అందుకోగా, ప్రస్తుతం లవ్ అండ్ వార్(love and war) తో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఇన్షా అల్లా(Inshaa allah)ను మళ్లీ పట్టాలెక్కించే ఆలోచన జరుగుతోందనే వార్తలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి.
సల్మాన్ ఖాన్(Salman khan)తో తెరకెక్కాల్సిన ఈ సినిమా గతంలో అనూహ్యంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భన్సాలీ ఆ కథను యథాతథంగా తీసుకురావడం లేదట. కథలోని ప్రధాన భావనను కొనసాగిస్తూనే, ప్రస్తుత ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను పూర్తిగా రీవర్క్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇది పాత ఇన్షా అల్లా కు సీక్వెల్ గా కాకుండా, అదే ఆలోచనకు కొత్త రూపంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఆలియాకు జోడీగా ఎవరు నటిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షారుక్ ఖాన్ పేరు గతంలో వినిపించినప్పటికీ, ఇప్పటివరకు ఏ హీరో పేరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాతే నటీనటులను భన్సాలీ ఫైనల్ చేయనున్నారట. కథకు తగ్గట్టు అవసరమైతే యంగ్ హీరోను కూడా ఎంపిక చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.








