‘మెడికవర్’ హాస్పిటల్ సీఎం రేవంత్ రెడ్డిదేనా..? నిజమేంటి?
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆస్తులపై మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టిందంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రతిగా అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయటపెడుతూ బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తోంది. ఈ పోరులో ప్రముఖ మెడికవర్ ఆసుపత్రి కూడా తెరపైకి రావడం రాష్ట్రంలో కలకలం రేపింది.
మెడికవర్ ఆసుపత్రి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానిదే అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు ఆర్థిక ఆరోపణలు చేసుకుంటున్న వేళ, మెడికవర్ ఆసుపత్రిని ఇందులోకి లాగడం కలకలం రేపింది. దీని ద్వారా ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ వదంతులపై మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్పందించింది. సీఓఓ మహేష్ డిగ్లూరికర్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తమ ఆసుపత్రికి ఏ రాజకీయ పార్టీతోనూ, నేతలతోనూ ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అసత్య కథనాలని, వాటిని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మెడికవర్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వాల అధినేతలు హాజరయ్యారని యాజమాన్యం స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి మరొక ఆసుపత్రిని ప్రారంభించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా వివిధ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు బేగ్పేట ఆసుపత్రి ప్రారంభోత్సవానికి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మరొక కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్రలోనూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, సీనియర్ నాయకులు శరద్ పవార్ తదితరులు వివిధ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు ఎవరైనా అధికారిక హోదాలో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే, దానిని రాజకీయ సంబంధంగా చిత్రీకరించడం తగదని మహేష్ డిగ్లూరికర్ తేల్చిచెప్పారు. రాజకీయ లబ్దికోసం తమ ఆసుపత్రులను ఇలాంటి వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల రోగుల్లో, వారి కుటుంబ సభ్యుల్లో అనవసర ఆందోళన కలుగుతుందని హెచ్చరించారు. ఆసుపత్రి వివరణ ఇచ్చిన తర్వాత అయినా ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.








