భారత్-అమెరికా స్టార్టప్ వ్యవస్థలను బలోపేతమే లక్ష్యంగా… భారత కాన్సులేట్‌లో ఎస్ఎఫ్ టెక్ వీక్..
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఎస్ఎఫ్ టెక్ వీక్ (#SFTechWeek) కార్యక్రమం లో భాగంగా ప్రతిష్టాత్మక ‘యూఎస్-ఇండియా కారిడార్ ఫౌండర్స్ మీట్’ విజయవంతంగా జరిగింది. ప్రపంచంలోనే రెండు అగ్రగామి స్టార్టప్ వ్యవస్థలైన భారత్, అమెరికాల మధ్య అనుసంధానాన్ని పెంచుతున్న కీలక ప్రతినిధులను ఒకే చోటికి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది. Qapita, Inventus Law భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని కాన్సులేట్ సమన్వయం చేసింది.
ఫౌండర్లకు ఘన స్వాగతం
ఈ ప్రత్యేక సదస్సుకు విచ్చేసిన 120 మందికి పైగా స్టార్టప్ ఫౌండర్లు, పారిశ్రామికవేత్తలు, ఎకోసిస్టమ్ వాటాదారులకు కాన్సుల్ (టెక్నాలజీ) శ్రీపాల్ చిట్టిరెడ్డి సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాంకేతిక భాగస్వామ్యం, స్టార్టప్‌లకు ఉన్న విస్తృత అవకాశాల గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
క్రాస్-బోర్డర్ వ్యాపారాలపై చర్చ
ఈ కార్యక్రమంలో భాగంగా ‘న్యావిగేటింగ్ ది యూఎస్-ఇండియా కారిడార్’ అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ జరిగింది. భారత్, సిలికాన్ వ్యాలీ అంతటా క్రాస్-బోర్డర్ కార్యకలాపాలను ప్రారంభించడం, వ్యాపారాలను విస్తరించడం, ఎదురయ్యే చట్టపరమైన అంశాలను ఈ ప్యానెల్ లోతుగా విశ్లేషించింది. ఇన్వెంటస్ లా ఫౌండర్, మేనేజింగ్ పార్టనర్ అనిల్ అద్వానీ, అలాగే జెన్స్కార్(Zenskar) ఫౌండర్ అపూర్వ్ బన్సాల్ ఈ చర్చలో పాల్గొని సరిహద్దు దాటి విస్తరించే వ్యాపారాలకు సంబంధించిన విలువైన సలహాలు, కీలక అభిప్రాయాలు పంచుకున్నారు.








