వాళ్లంతా వైట్‌హౌస్ శత్రువులే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)’ పేరు మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఇకపై “సూపర్ ఇంటెలిజెన్స్” (SI) అని పిలవాలని, అలా కాకుండా పాత పేరుతోనే పిలిచే వారందరినీ దేశ శత్రువులుగా పరిగణిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఈ ప్రకటన చేశారు. “అత్యంత ఆమోదయోగ్యమైన, కొత్త , మరింత కచ్చితమైన ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదానికి బదులుగా, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదాన్ని ఉపయోగించే వారిని వైట్ హౌస్ శత్రువుగా పరిగణిస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు.
పేరు మార్పు వెనుక…
ఏఐ సాంకేతికతపై ప్రజల్లో పెరుగుతున్న భయాలు, ఆందోళనలు, అలాగే ప్రభుత్వాల నుంచి నియంత్రణ , కఠినమైన రక్షణ చర్యల కోసం వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ట్రంప్ ఈ పేరు మార్పు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఇప్పటికే అధికారికంగా ఏఐ పేరును ఎస్ఐ(SI)గా మార్చిందని ఆయన వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతను ప్రజల్లో మరింత సానుకూల దృక్పథంతో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ రీబ్రాండింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నియంత్రణ లేని ఏఐ ఏజెంట్లు ప్రభుత్వ , ప్రైవేట్ వెబ్సైట్లను చట్టవిరుద్ధంగా హ్యాక్ చేయడం వంటి ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక ఏఐ అభివృద్ధిపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్పందించిన ఎలాన్ మస్క్…
ట్రంప్ తాజా నిర్ణయానికి టెక్ దిగ్గజాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇటీవల ఎక్స్యూజర్ ఒకరు.. స్పేస్ఎక్స్ఏఐ (SpaceXAI) అధినేత, ట్రంప్ మిత్రుడు అయిన ఎలాన్ మస్క్‌ను “కంపెనీ పేరును స్పేస్ఎక్స్ఎస్ఐ (SpaceXSI) గా మారుస్తారా?” అని అడగ్గా.. “అవును, మేము ఆ మార్పు చేస్తాము” అని మస్క్ బదులిచ్చారు. మరోవైపు, వైట్‌హౌస్ తన అధికారిక ఏఐ వెబ్‌సైట్‌ను కూడా అప్డేట్ చేసింది. అందులో ఏఐ(AI) ప్రస్తావనలన్నింటినీ తొలగించి వాటి స్థానంలో ఎస్ఐ(SI)ని చేర్చింది. అయితే, వెబ్సైట్ డొమైన్ పేరు మాత్రం ఇప్పటికీ ‘ai.gov’ గానే కొనసాగుతుండటం గమనార్హం.
టెక్ దిగ్గజాలతో ట్రంప్ విందు…
ఏఐ వల్ల ముప్పు పొంచి ఉందన్న వాదనలను ట్రంప్ ఒక బూటకంగా కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఏఐ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా అధిపతి జెన్సన్ హువాంగ్, ఎలాన్ మస్క్ తదితరులతో కలిసి ఒక ప్రత్యేక విందు సమావేశం నిర్వహించారు. ఏఐ కంపెనీలు స్వయంగా ప్రభుత్వ నియంత్రణను కోరుతున్నప్పటికీ, ఆయా కంపెనీలు స్వీయ-నియంత్రణ పాటిస్తాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
చైనాతో పోటీలో అమెరికాదే పైచేయి…
ప్రస్తుతం ప్రపంచ ఏఐ పోటీలో అమెరికా తిరుగులేని దేశంగా ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. అత్యాధునిక ఏఐ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెమ్మదింపజేయకూడదని, ఒకవేళ అలా చేస్తే చైనా చేతిలో ఓడిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఏఐ(ఎస్ఐ)లో ఎవరు గెలిస్తే, వారే ప్రపంచాన్ని గెలిచినట్లు” అని ట్రంప్ స్పష్టం చేశారు.








