జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం..
విదేశీ ఒప్పందపు పనివాళ్లు… వీసా మిల్లులు.. ఇవీ టెక్ దిగ్గజాల పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ సస్పెన్షన్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ చేసిన వ్యాఖ్యలు. మేధో ప్రతిభతో అమెరికాను సుసంపన్నం చేసిన టెక్ నిపుణులను.. ఒప్పందపు పనివాళ్లంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామంపై టెక్ కంపెనీలతో పాటు భారత్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా చరిత్రను తిరగేసి చూస్తే.. మేధో ప్రతిభ, వలసలు.. ఆదేశాన్ని ఎంత సుసంపన్నం చేశాయో అర్థమవుతుందని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.
కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని కంపెనీలను పర్మ్ (పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్) నుంచి సస్పెండ్ చేసిన సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ( US Vice President JD Vance) చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆయన అనవసరంగా మాట్లాడారని, నిపుణుల తరలింపుతో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతోందని స్పష్టంగా చెప్పింది.
ఇవి కూడా చదవండి
‘‘నిపుణుల తరలింపు.. భారతీయులకు అవకాశాలు కల్పించడంతో పాటు అమెరికా కంపెనీల సంపదను కూడా పెంచుతోంది. ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగకల్పన వంటి విషయాల్లో కంపెనీలకు అత్యాధునిక ప్రతిభ ఎంతో సహాయకారిగా ఉంది. ఈ తరలింపు ఇరుదేశాలకు ప్రయోజనకరమే. ఈ ప్రక్రియలో భాగమైన ప్రతిఒక్కరూ ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారని భావిస్తున్నాం. అమెరికా ఆంక్షలు ఇరు దేశాల ఆకాంక్షలకు, భాగస్వామ్యానికి ఏమాత్రం దోహదపడవు. తరతరాల వలసదారుల శ్రమ, కృషి, ఆవిష్కరణలు అమెరికా అభివృద్ధి, శ్రేయస్సుకు దోహదపడ్డాయి. ఆ దేశ చరిత్రను తీర్చిదిద్దాయి. సామ్రాజ్యవాద భావనలు కలిగి ఉన్న పదజాలాన్ని ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరం ’’ అని కేంద్ర విదేశాంగ శాఖ తన ప్రకటనలో ఆక్షేపించింది (India slammed JD Vance).
ఇదిలా ఉంటే.. ఈ సస్పెన్షన్ కేవలం పర్మ్ ప్రోగ్రామ్‌కు మాత్రమే వర్తిస్తుందని, ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాల చెల్లుబాటుపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్రం చెప్పింది. అయితే, ఆయా సంస్థల్లో పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉద్యోగుల ఆశలకు మాత్రం దీంతో గండిపడనుంది.








