విజయ్ దేవరకొండ వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక చర్య
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన వ్యక్తిగత గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడంపై న్యాయపోరాటానికి దిగారు. తన పేరు, ఫొటోలు, వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పేరుతో నకిలీ ప్రచారాలు నిర్వహించడం, తప్పుడు ఎండార్స్మెంట్లు క్రియేట్ చేయడం, ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు.
సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ తో పాటు ఆన్లైన్ షాపింగ్ సైట్లలోనూ తన గుర్తింపును పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తున్నారని విజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరుతో టీషర్టులు, మగ్లు అమ్మడం, వ్యక్తిగత లక్షణాలను ఉపయోగించే మొబైల్ అప్లికేషన్లు, డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ వెబ్సైట్లపై రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని అభ్యంతరకర లింకులను పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తొలగించినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సంబంధిత ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. తాత్కాలికంగా నిషేధ ఆజ్ఞలు విధించాలన్న విజయ్ అభ్యర్థనపై కూడా నోటీసులు ఇచ్చింది. మధ్యంతర ఉపశమనంపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, ఈ వ్యవహారంపై తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.








