టీటీఏ ఆధ్వర్యంలో దసరా సంబరాలకు వేలాయే.. రేల రవి జానపద పాటలతో హోరెత్తనున్న వేదిక
అమెరికాలోని అట్లాంటా నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో దసరా సంబరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 24, 2026 శనివారం రోజున సాయంత్రం 4 గంటల నుంచి డెసానా మిడిల్ స్కూల్(625 జేమ్స్ రోడ్, ఆల్ఫారెట్టా, జార్జియా 30004) వేదికగా ఈ వేడుకలను నిర్వహించడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. చెడుపై మంచి సాధించిన ఈ విజయ దశమి వేడుకలను కేవలం చూడటమే కాకుండా, అందులో భాగస్వాములు కావాలని టీటీఏ అట్లాంటా ప్రతినిధులు కోరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఉత్సాహాన్ని కూడా తోడుగా తీసుకొని ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవడానికి విచ్చేయాలని టీటీఏ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం అని, అలాగే హాజరైన వారందరికీ రాత్రి భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు.
ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు…
ఈ దసరా వేడుకల్లో భాగంగా ఎన్నో రకాల ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రముఖ జానపద గాయకుడు రేల రవి లైవ్ మ్యూజిక్ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయన పాడే హుషారైన పాటలు అందరినీ ఉర్రూతలూగించనున్నాయి. మన సంప్రదాయాలకు ప్రాణమైన కోలాటం, కళ్లు చెదిరే ఫ్యాషన్ వాక్, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేసేలా పండుగ వస్తువులతో కూడిన వెండర్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ వేదికపై స్పాన్సర్లను ఘనంగా సత్కరించనున్నారు.
రిజిస్ట్రేషన్, నిర్వాహకుల వివరాలు…
ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఫ్లయర్‌లో చూపించిన లింకుల ద్వారా జనరల్, వెండార్ స్టాల్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఆర్గనైజింగ్ టీమ్‌లోని త్రిలోక్ గుంటుక (773-512-2894), దీప్తి ఏలుగురి (312-316-6872), నిధీష్ రాజు భాస్కరుని (510-556-9962), శశాంక్ గుజ్జారి (409-273-1847)లను సంప్రదించవచ్చు.








