ఆ సీనియర్ డైరెక్టర్ రీఎంట్రీ కోసం ఎదురుచూపులు!
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు తనదైన శైలిని జోడించి ఆడియన్స్ ను అలరించిన డైరెక్టర్ వీవీ వినాయక్(VV Vinayak). మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ను సమపాళ్లలో మేళవించడంలో ఆయన తనదైన ప్రత్యేకత చూపించారు. స్టార్ హీరోలతో భారీ సక్సెస్‌లను అందుకొని ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ల సరసన నిలిచారు. అయితే కాలక్రమేణా వరుస ఫ్లాపులు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వినాయక్ మళ్లీ మెగాఫోన్ పట్టాలని ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు.
వినాయక్ రీఎంట్రీ కోసం గతంలో పలు కథలు రెడీ అయినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. నిర్మాత నల్లమలుపు బుజ్జి(nallamalupu bujji) ఆయనతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్(venkatesh)తో సినిమా చేయాలనే డిస్కషన్స్ జరిగినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో వినాయక్ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ వినాయక్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటీనటులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అందరి అభిమానాన్ని పొందారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు వినాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు. సరైన కథతో ఆయన మళ్లీ సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.








