పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తాం : సీఎం చంద్రబాబు
రిజర్వేషన్లను అడ్డుకునేందుకే గొడ్డలి పార్టీ పిటిషన్లు
రైతులు హలాన్ని పట్టుకోవాలి అర్జీలు కాదు
రాజముద్రతో భూమికి భరోసా కల్పించాం
ఇప్పటికి 40.58 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ
16.48 లక్షల ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగింపు
కొండపిలో 2,915 ఎకరాల గర్భకండ్రిక భూ సమస్యల పరిష్కారం
ప్రకాశం జిల్లా మీ భూమి-మీహక్కు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
రూ.166 కోట్లతో పాలేరు రిజర్వాయర్‌కు శంకుస్థాపన
కొండపి, అక్టోబరు 09:- రైతులు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలే తప్ప.. భూమి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూమి రైతుదేనని, దానిపై హక్కు కూడా రైతుదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ వివాదాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో హక్కులను పరిరక్షించేందుకు రీసర్వే ప్రక్రియను చేపట్టామని తెలిపారు. రీసర్వే 2.0 అనంతరం రాజముద్రతో కూడిన పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టా దారు పాస్ పుస్తకాలనుపుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామసభలో ఆయన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలనలో భూములకు భద్రత లేకుండా పోయిందని, ఆక్రమణలు, దందాలు, భూ వివాదాలతో రెవెన్యూ వ్యవస్థను దెబ్బతీశారని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రజల ఆస్తులపై ఫొటోలు వేసుకుని, సర్వే రాళ్లపై రాజకీయ నాయకుల బొమ్మలు పెట్టారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో భూములపై వివాదాలు సృష్టించారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. గతంలో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. కంగుంది, అమలాపురం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,315 ఎకరాల గర్భ కండ్రిక భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు. పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేందుకే ప్రతినెలా ప్రజల ముందుకు వస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం సక్రమంగా పూర్తయ్యేంత వరకూ రైతుల వద్దకు వస్తూనే ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే తాను స్వయంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టా దారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశామని వెల్లడించారు. అక్టోబరులోనే 790 గ్రామాల్లో నాలుగు లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. ఇంకా పంపిణీ చేయాల్సిన 51 లక్షల పాస్ పుస్తకాలకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, అర్హులైన రైతులందరికీ అందిస్తామని చెప్పారు. చిట్టచివరి రైతు వరకూ పారదర్శకంగా హక్కు పత్రాలు అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
రూ.166 కోట్లతో పాలేరు రిజర్వాయర్
ప్రకాశం జిల్లాలోని ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతుల చెంచయ్య–పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.166.40 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ ద్వారా 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాల్లో 35 వేల మందికి తాగునీరు అందుతుందని వివరించారు. పొన్నలూరు మండలం వేమూరుపాడు రహదారి, పాలేరు నదిపై వంతెన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశామని తెలిపారు. రూ.28 కోట్లతో ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా పూర్తిచేసి అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నీరు అందుబాటులోకి రాకుండానే రిబ్బన్లు కట్ చేయడం, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసినట్లు ప్రచారం చేసుకోవడం తమ విధానం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 40 చిన్నా పెద్ద నదులను అనుసంధానించి నీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించవచ్చన్నారు. గోదావరి నుంచి కావేరి వరకు అనుసంధానం జరిగితే నాలుగు రాష్ట్రాల్లో నీటి కొరతను అధిగమించే అవకాశం ఉంటుందని చెప్పారు. రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. భూగర్భ జలాల పెంపునకు కూడా పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రకాశం అభివృద్ది
ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలను ప్రపంచ స్థాయి ఉద్యానవన పంటల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పల్లె పండుగ ద్వారా రూ.11 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరి తదితర ప్రాంతాల్లో 60 వేల మందికి నివాస స్థలాలపై హక్కులు కల్పించామని, వాటి మార్కెట్ విలువ రూ.52 వేల కోట్లుగా ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అదనంగా మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా అమరజీవి జలధార కింద రూ.31 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రూ.1.5 లక్షల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేస్తోందని సీఎం వెల్లడించారు. రామాయపట్నం పోర్టు గతంలోనే పూర్తి కావాల్సి ఉన్నా నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
బీసీలకు పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయానికి సంబంధించి స్పందించిన ముఖ్యమంత్రి.. పార్టీ పరంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు. టీడీపీకి బీసీలు వెన్నెముక అని, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి పార్టీ ఎప్పుడూ కృషి చేసిందని చెప్పారు. గతంలో తాము తీసుకొచ్చిన 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టించిందని వాటిని 24 శాతానికి తగ్గించడం వల్ల అనేకమంది నష్టపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే న్యాయస్థానాల తీర్పులతో ఆ రిజర్వేషన్ల అమలుకు ఆటంకం ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు సంబంధిత జీవోను కొట్టివేసినప్పటికీ, పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓటమి తప్పదనే సర్ పేరిట స్థానిక ఎన్నికలను కూడా అడ్డుకోవాలన్న ఆలోచనతోనే గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లిందని సీఎం ఆక్షేపించారు
ప్రజాభిప్రాయం ఆధారంగా పాలనలో మార్పులు
ప్రజల బాగోగులే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేవుడిని ప్రార్థించే సమయంలో కుటుంబానికి మంచి జరగాలని కోరుకోవడంతో పాటు, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ పనితీరుపైనా ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను ఫోన్ ద్వారా నేరుగా తెలుసుకుని, అవసరమైన మార్పులు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేసి, పౌరసేవల్లో పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగ సామర్థ్యాలను మరింత పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల శ్రీవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.








